15,640 కానిస్టేబుల్ పోస్టులకు తొలగిన అడ్డంకి
కానిస్టేబుల్స్ నియామకాల వివాదంకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు కొట్టివేసింది

- సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్
- నియామకాలకు తొలగిపోయిన అడ్డంకులు
- తప్పిదాలపై నిపుణల కమిటీతో పరిశీలన
- 4 వారాల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలి
- పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
విధాత : కానిస్టేబుల్స్ నియామకాల వివాదంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో 15,640 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. కానిస్టేబుల్ ప్రశ్న పత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సెలక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేయగా, గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్సపర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.
పోలీస్ నియామక మండలి వివిధ కానిస్టేబుళ్ళ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో సివిల్ కానిస్టేబుల్‌తోపాటు, ఫైర్, రవాణా శాఖ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రిలిమ్స్‌తోపాటు ఫిజికల్ టెస్టులు, మెయిన్స్ కూడా నిర్వహించింది. అర్హత పరీక్ష సందర్భంగా ఇచ్చిన ప్రశ్నల్లో కొన్ని ఆప్షన్లను తెలుగులోకి అనువాదం చేయలేదని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇచ్చిన ప్రశ్నల్లోని నాలుగు ప్రశ్నలకు తెలుగు అనువాదం సరిగ్గా చేయలేదని, దీనివల్ల తాము నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు కొన్ని నెలల కిందట సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఈ నాలుగు ప్రశ్నలకు మార్కులు కలిపి నియామక ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎంపికైన కొంతమంది అభ్యర్థులు, పోలీస్ నియామక మండలి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అభ్యర్థుల, పోలీస్ నియామక మండలి వాదనలు వినిపించింది. ఎవరైతే అభ్యర్థులు నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లలో తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల గుర్తించలేకపోయామని వాదించారు. దీనికి ఆ ఆప్షన్లలో ఇచ్చిన సమాధానాలు నిత్యం వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని, కాబట్టి వాటిని ప్రత్యేకంగా అనువాదం చేయాల్సిన అవసరం లేదని పోలీస్ నియామక మండలి తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సాయం తీసుకుని స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలని సూచించింది. ఈ కమిటీ ఈ నాలుగు ప్రశ్నలకు సంబంధించిన అభ్యంతరాలను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలని, దాని ఆధారంగా పోలీస్ నియామక మండలి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొన్నది. ఇదంతా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.