NALGONDA: పిల్లి రామరాజు పై వేటు… పంతం నెగ్గించుకున్న కంచర్ల

భ‌గ్గుమంటున్న రామ‌రాజు, త‌న వ‌ర్గీయులు Ramaraju.. Kancharla Bhupal reddy విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ రాజకీయాలు సోమవారం కీలక మలుపు తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా పార్టీలో సొంత కార్యకలాపాలు సాగిస్తున్న పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజును పార్టీ పదవి నుండి తొలగించే ప్రక్రియను భూపాల్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. సోమవారం భూపాల్ రెడ్డి తన […]

NALGONDA: పిల్లి రామరాజు పై వేటు… పంతం నెగ్గించుకున్న కంచర్ల
  • భ‌గ్గుమంటున్న రామ‌రాజు, త‌న వ‌ర్గీయులు

Ramaraju.. Kancharla Bhupal reddy
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ రాజకీయాలు సోమవారం కీలక మలుపు తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లక్ష్యంగా పార్టీలో సొంత కార్యకలాపాలు సాగిస్తున్న పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజును పార్టీ పదవి నుండి తొలగించే ప్రక్రియను భూపాల్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు.

సోమవారం భూపాల్ రెడ్డి తన నివాసం వద్ద నిర్వహించిన నల్గొండ పట్టణ పార్టీ సమావేశంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి సమక్షంలో నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. పార్టీలో తనకు ప్రత్యర్థిగా మారిన పిల్లి రామరాజును పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ పాత కమిటీ స్థానంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని జాగృతి విభాగం నేత, బోనగిరి దేవేందర్‌ను నియమించారు. అలాగే కమిటీ లో 59మందిని వివిధ పదవుల్లో నియమించి అసమ్మతి తలెత్తకుండా జాగ్రత్తగా పడ్డారు.

సమావేశంలో కంచర్ల మాట్లాడుతూ దేవేందర్ పేరును తాను ప్రతిపాదించగా బండ నరేందర్ రెడ్డి బలపరిచారని, ఇదే సమాచారాన్ని తాను ఫోన్లో మంత్రి జగదీష్ రెడ్డికి తెలుపగా ఆయన కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. అందరి ఆమోదంతో పార్టీ పట్టణ కమిటీ నూతన అధ్యక్షుడిగా బోనగిరి దేవేందర్‌ను ఎంపిక చేసినట్లు సమావేశంలో కంచర్ల ప్రకటించారు.

అలాగే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న చీర పంకజ్ యాదవ్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ అభ్యర్థిగా కంచర్ల, బండ ప్రకటించారు. పార్టీలో టికెట్ విషయంలో కంచర్లకు మరో ప్రత్యర్థిగా మారిన సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో కంచర్లపైన, సీఎం కేసీఆర్ పాలన పైన విమర్శలు చేసిన చీర పంకజ్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా మార్కెట్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసిన కంచర్ల ఒకేరోజు అటు పిల్లికి, ఇటు చకిలంకు ఇద్దరికీ రాజకీయంగా చెక్ పెట్టారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

రగిలిపోతున్న రామరాజు వర్గీయులు

పట్టణ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా పిల్లి రామరాజును తొలగించడం పట్ల రామరాజు వర్గీయులు కంచర్లపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టిడిపి నుండి కంచర్లతో పాటు బిఆర్ఎస్‌లో చేరి ఆయన గెలుపులో కీలక భూమిక పోషించిన పిల్లి రామరాజు యాదవ్ గత కొంతకాలంగా కంచర్లతో విబేధించి ఆయనకు పోటీగా నియోజకవర్గంలో సొంతంగా రాజకీయ, ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ రేసులో తాను సైతం ఉన్నానని, ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానంటూ జనంలో పలు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. దీంతో సహజంగానే కంచర్లకు, పిల్లి రామరాజుకు మధ్య వైరం ముదిరిపోగా ఆయనను పార్టీ పట్టణ అధ్యక్ష పదవి నుండి తొలగించేందుకు కంచర్ల కొన్ని నెలలుగా పావులు కదుపుతూ చివరకు తాను అనుకున్న పని పూర్తి చేశారు.

తొలగింపు పై పిల్లి గర్జన

రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనను పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి పదవి నుండి తొలగించడం విడ్డూరంగా ఉందని పిల్లి రామరాజు ఆక్షేపించారు. నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి అహంభావపూరిత పోకడలతో నష్టపోతున్న పార్టీని బలోపేతం చేసేందుకు తాను సీఎం కేసీఆర్ బొమ్మతోనే తన ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ కేసీఆర్ ను మెప్పించి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించాలని పార్టీ లైన్లోనే పని చేస్తున్నానన్నారు.

ఖమ్మం బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు కూడా తాను పది బస్సులలో ప్రజలను తీసుకెళ్లానన్నారు. నేను ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, అలాంటి నన్ను కేవలం తన వ్యక్తిగత పంతం నెగ్గించుకోవడం కోసం భూపాల్ రెడ్డి పదవి నుండి తొలగించేలా చేశారన్నారు. నేను ప్రజాసేవ కార్యక్రమాలతో పార్టీ బలోపేతం కోసం పని చేస్తుంటే, భూపాల్ రెడ్డి తన స్వార్ధ రాజకీయాలతో పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. టిడిపిలో తాను నాలుగేళ్లు, బిఆర్ఎస్‌లో రెండున్నర ఏండ్లు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పని చేశానని, నన్ను భూపాల్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించడం ద్వారా నాకు ప్రజల్లో తిరిగేందుకు మరింత స్వేచ్ఛను, పదోన్నతిని కల్పించినట్లయిందన్నారు.

పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనను గతంలో కేవలం 10 వార్డులకే పరిమితం కావాలంటూ భూపాల్ రెడ్డి ఆంక్షలు విధించారని, ఇప్పుడు తనను తొలగించడం ద్వారా ఆయనకు వచ్చే రాజకీయ మైలేజీ ఏమీ ఉండదని, తన చర్యలతో రాజకీయంగా భూపాల్ రెడ్డి తన గోతిని తానే తొవ్వుకున్నారన్నారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో మునుముందు కూడా తన ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు.