కొత్త సంప్రదాయం.. కలెక్టరేట్లలోనే రిపబ్లిక్ డే ఉత్సవాలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసిన సర్కార్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26న రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవాలను ఆయా జిల్లా కలెక్టరేట్లలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ కార్యాలయాలకు పరిమితం […]

- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- కొత్త సంప్రదాయానికి తెరతీసిన సర్కార్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26న రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవాలను ఆయా జిల్లా కలెక్టరేట్లలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ కార్యాలయాలకు పరిమితం చేయడం గమనార్హం. గతంలో ఆయా జిల్లా కేంద్రాలలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో లేదా ఇతర గ్రౌండ్లలో నిర్వహించేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేవారు.
జిల్లాల విభజన అనంతరం పోలీస్ గ్రౌండ్‌లో హనుమకొండ జిల్లా ఉత్సవాలు, జెఎన్ఎస్ గ్రౌండ్లో వరంగల్ జిల్లా రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించారు. గత సంవత్సరం వరంగల్ జిల్లా ఉత్సవాలను ఖిల్లా వరంగల్లో నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ములుగు జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టరేట్లలో రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.
గతంతో పోల్చుకుంటే రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నూతన కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో నూతన కలెక్టరేట్లలో ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని భావించారేమోనని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అయితే కొన్ని జిల్లాలలో ఉదాహరణకు వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో నూతన కలెక్టరేట్ల కార్యాలయాలు నిర్మాణం చేయకపోవడంతో ప్రస్తుతం కలెక్టరేట్లు నిర్వహిస్తున్న ప్రాంగణాలలోనే ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలలో నూతన కలెక్టరేట్లు విశాల ప్రాంగణంలో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ మూడు జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయాలను ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
వరంగల్ జిల్లాలో కలెక్టర్ స్థల పరిశీలన
ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బి.గోపి అధికారులను ఆదేశించారు. ఈనెల 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రిపబ్లిక్ డే వేడుకలను వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్నందున అందుకు కావలిసిన అన్నీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
గణతంత్ర వేడుకలు జరిగే కలెక్టరేట్ ఆవరణను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ ఆవరణలో అనువైన ప్రాంతంలో స్టేజ్ ఏర్పాటు చేయాలన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత.. ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమం లో RDo మహేందర్ జీ, AO శ్రీకాంత్, వివిధ సెక్షన్ ల సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.