Revanth Reddy | కేసీఆర్, కిషన్‌రెడ్డి ఒక్కటే.. వేర్వేరు కాదు: రేవంత్ రెడ్డి
Revanth Reddy కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు కవితను జైలులో పెట్టి సానుభూతి పొందాలని కేసీఆర్ వ్యూహం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదు ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత, హైదరాబాద్: కేసీఆర్.. కిషన్ రెడ్డి వేర్వేరు కాదు కేసీఆర్ అనుచరుడే […]

Revanth Reddy
- కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారు
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు
- కవితను జైలులో పెట్టి సానుభూతి పొందాలని కేసీఆర్ వ్యూహం
- సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదు
- ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్: కేసీఆర్.. కిషన్ రెడ్డి వేర్వేరు కాదు కేసీఆర్ అనుచరుడే కిషన్‌రెడ్డి అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ పెద్దలు అతడిని అధ్యక్షుడిగా ఎందుకు చేశారో కిషన్‌రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆదివారం తాజ్‌కృష్ణ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయన్నారు.
ఇందుకు నిదర్శనమే ఇవాళ ఆ మూడు పార్టీల సభలు, కార్యక్రమాలన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.
కేసీఆర్ అవినీతిపై విచారణకు ఎందుకు ఆదేశించరు
‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై ఇవాళ్టి వరకు ఈడీ, సీబీఐ కాదు.. ఈగ కూడా వాలలేదు. మోదీ, అమిత్ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు’’ అని రేవంత్ ప్రశ్నించారు.
కవితను తీహార్ జైలుకు పంపించాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం
కాళేశ్వరాన్ని కేసీఆర్ ఎటిఎంలా వాడుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారన్నారు. కాళేశ్వరం అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ స్కామ్‌లో వాటాలు పొందుతున్న బీజేపీ కాంగ్రెస్‌ను నిందించడం తప్ప ఇంకా ఏం చేయగలదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో సానుభూతి పవనాలతో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలువడానికి కూతురిని కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలనుకునే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని, ఇందుకు కేసీఆర్ మోదీకి సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌కు ఉరి వేయాలి
కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ పెట్టిన కేసులో మాత్రమే కవిత ఇరుక్కున్నారని, అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 100 కోట్లకే ఆప్ మంత్రులను జైలుకు పంపితే.. మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌ను ఉరి వేయ్యాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోనియా ను,రాహుల్ ను ఈడీ వేధించింది కనిపించడం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీకి మద్దతు ఇస్తున్న బీఆరెస్, ఎంఐఎంలు
బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ఈ రోజు సభలో ఇచ్చే గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. సభలోనే వర్చువల్‌గా నాలెడ్జ్ సెంటర్‌కు సోనియా భూమి పూజ చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.
బీఆరెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు
ఏ లక్ష్యంతో సోనియా తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ లక్ష్యాన్ని, కలను నెరేవేర్చేందుకే ఇవాళ విజయభేరి సభ అన్నారు. ఎంఐఎం, బీఆరెస్, బీజేపీ సభలకు లేని ఆంక్షలు కాంగ్రెస్ కే ఎందుకు? అని ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు బీఆరెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రాజెక్టు వ్యయం కన్నా ప్రకటనల ఖర్చే ఎక్కువ
కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించడం.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం కన్నా.. దానికి చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కవని ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.