సన్నాయి నొక్కులు మానుకోండి: రేవంత్‌రెడ్డి

- తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే ప్రధాని తప్పుపట్టారు
- మోడీ సభకు సీఎం కేసీఆర్ పరోక్ష సహకారం
- కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
విధాత, హైదరాబాద్: సన్నాసి లాజిక్కులు, సన్నాయి నొక్కులు మానుకోవాలని బీఆరెస్, బీజేపీలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీ, బీరెస్ పార్టీలు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. గాంధీ భవన్‌లో సోమవారం గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం రేవంత్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోడీ తప్పు పట్టారని, తెలంగాణపై వివక్ష చూపుతున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీలనే మోడీ మళ్లీ ఇచ్చారని విమర్శించారు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ గతంలో ఇచ్చిన హామీలేనని వెల్లడించారు.
ప్రధాని పాలమూరు పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయా హోదా ప్రకటిస్తారని.. బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు విభజన హామీలను అమలు చేస్తారని ఆశించామన్నారు. ఐటీఐఆర్ కారిడార్ పునరుద్ధరణ, తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటారనుకున్నాం కానీ ఇవేవీ ప్రధాని ప్రస్తావించలేదని విమర్శించారు.
ప్రధాని సభను పాలమూరు జిల్లాలో నిర్వహించినందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ సభకు సీఎం కేసీఆర్ పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని ప్రధాని ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం, ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించలేదని, దీంతో తెలంగాణ ప్రజలకు బీజేపీ, బీఆరెస్ చీకటి ఒప్పందం అర్థమైందన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే తెలంగాణ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీర్, హరీశ్‌రావులు రాష్ట్రంలో బిల్లా, రంగాల్లా తిరుగుతున్నారన్నారు.
రాష్ట్రాల ఆదాయం, ప్రజల అవసరాలనుబట్టి పథకాలు ఉంటాయి కానీ, ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం విలువ తెలియదని, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు రండి, 20014 నుంచి 2023 వరకు మీరు ఇచ్చిన హామీల అమలుపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో అమలు చేసాం, ఇప్పుడూ ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే నైతికత బిల్లా, రంగాలకు లేదని, తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మదు, క్షమించదని హెచ్చరించారు.