సమయమొచ్చింది.. బీఆరెస్‌ను ఓడించండి: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ రాక్షస పాలన అంతానికి సమయమొచ్చిందని, నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

- స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి పిలుపు
విధాత : మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేసిన సీఎం కేసీఆర్ రాక్షస పాలన అంతానికి సమయమొచ్చిందని, మళ్లీ మీకు పూర్వ వైభవం రావడానికి జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. ట్వీట్టర్ వేదికగా కూడా అభ్యర్ధించారు.

సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కట్టు బానిసల కంటే హీనంగా చూసి, వారిని ఆర్ధికంగా ఇబ్బందుల పాలు చేశారన్నారు. ఫిరాయింపులతో ఆత్మగౌరవాన్ని, నిధులు ఇవ్వక అప్పులు పాలు చేసి వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేశారన్నారు. ఊరి అభివృద్ధికి తెచ్చిన అప్పులు కట్టలేక చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా చేసి, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన బీఆరెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.