Revanth Reddy | బీజేపీతో చీకటి ఒప్పందం.. వామపక్షాలకు పంగనామం: రేవంత్ రెడ్డి

Revanth Reddy | బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎంలను ఓడించండి బెల్ట్‌ షాపుల్లోనే తెలంగాణ నంబర్‌ వన్‌ గోదావరి నీళ్లతో సీఎం కామారెడ్డికి రావాలి మంత్రి కేటీఆర్‌ ఈ సవాలుకు సిద్ధమా? ఇందిరమ్మ ఇళ్లున్న చోట మీరు ఓటగొద్దు ‘డబుల్‌’ ఇండ్లు ఉన్న చోట మేము అడగం మీడియా భేటీలో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విధాత, హైదరాబాద్‌: బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో కమ్యూనిస్ట్‌లకు పంగనామాలు పెట్టాడని […]

  • By: krs    latest    Aug 23, 2023 3:28 PM IST
Revanth Reddy | బీజేపీతో చీకటి ఒప్పందం.. వామపక్షాలకు పంగనామం: రేవంత్ రెడ్డి

Revanth Reddy |

  • బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎంలను ఓడించండి
  • బెల్ట్‌ షాపుల్లోనే తెలంగాణ నంబర్‌ వన్‌
  • గోదావరి నీళ్లతో సీఎం కామారెడ్డికి రావాలి
  • మంత్రి కేటీఆర్‌ ఈ సవాలుకు సిద్ధమా?
  • ఇందిరమ్మ ఇళ్లున్న చోట మీరు ఓటగొద్దు
  • ‘డబుల్‌’ ఇండ్లు ఉన్న చోట మేము అడగం
  • మీడియా భేటీలో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్‌: బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో కమ్యూనిస్ట్‌లకు పంగనామాలు పెట్టాడని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్‌ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడుతూ బీజేపీతో బీఆరెస్‌ పొత్తు ఖాయమైంది కాబట్టే కమ్యూనిస్టులను కేసీఆర్‌ కరివేపాకులా వాడుకుని వదిలేశారని అన్నారు.

మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన కేసీఆర్ నాడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని ప్రకటించారన్నారు. కానీ ఆ తరువాత ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్… అమిత్ షాతో చీకట్లో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పంగనామాలు పెట్టాడని ఆరోపించారు. నిజంగా కమ్యూనిస్ట్‌లతో స్నేహంగా ఉండాలని భావిస్తే వారికి సీట్లు ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎందుకు సీట్లు ప్రకటించారని రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

బీజేపీతో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టులను కేసీఆర్ వదిలేశారన్నారు. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆరెస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే నన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం మూడు పార్టీలను ఓడించండి.. కాంగ్రెస్ ను గెలిపించండి అని రేవంత్‌ పిలుపు ఇచ్చారు. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని, వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్‌ తెలిపారు.

బీఆరెస్‌ పాలనలో బొందలగడ్డగా మారిన తెలంగాణ

తొమ్మిదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘దేశంలో తెలంగాణ నెబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, ఒక్క తెలంగాణలో తప్ప’’ అని ఎద్దేవా చేశారు. వైన్ షాపుల టెండర్ల పేరుతో రూ. 2500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే… కేసీఆర్ రూ. 7500 కోట్లకు తెగమ్ముకున్నారన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని రేవంత్‌ తెలిపారు. కాంగ్రెస్ ఏం చేసిందో.. నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అన్నారు. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తోందన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరంలో లక్ష కోట్లు దిగమింగాడని ఆరోపించారు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదని రేవంత్‌ అన్నారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌కు సవాల్‌

కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగవద్దు… దీనికి సిద్దమా.. చెప్పండి.. అని రేవంత్‌రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌ ప్రకటించారు. అలాగే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5లక్షల సాయం అందిస్తామన్నారు.

26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌కు చెందిన బీఆరెస్ నేత హుగ్గెల్లి రాములుతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్‌లోచేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే సమక్షంలో రేవంత్‌రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.