విధాత: దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిన పోతున్నాయి. రైళ్లో దూరప్రయాణాలు చేసే ప్రయాణికులపై రాత్రివేళల్లో దాడులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న షిర్డీ – కాకినాడ (Sainagar Shirdi – Kakinada Port Express) ఎక్స్‌ప్రెస్ రైల్లో సోమవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది.
మహారాష్ట్రలోని పర్భణి(Parbhani) స్టేషన్ శివారులో సిగ్నల్ కోసం ఆగగా. ఇదే అదనుగా భావించిన దుండగులు బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి, మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. ఎస్2(S2) నుంచి ఎస్11(S11) వరకు మహిళలే టార్గెట్‌గా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం, భారీగా నగదుతోపాటు విలువైన వస్తువులను దోచుకున్నారు.
దీంతో బాధితులు లబోదిబోమంటూ పర్భణి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు.