Warangal: పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.20వేల పరిహారం ప్రకటించాలి
కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాల నాయకుల ధర్నా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వడగండ్లు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు తక్షణమే రూ.20వేల పరిహారం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు వివిధ సంఘాల నాయకులు రైతు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ […]

- కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్
- సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాల నాయకుల ధర్నా
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వడగండ్లు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు తక్షణమే రూ.20వేల పరిహారం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు వివిధ సంఘాల నాయకులు రైతు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం జిల్లాలో అకాల వడగళ్ల వర్షం వల్ల రైతులు తమ పంటను నష్టపోయారని వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎకరానికి 10వేల రూపాయలు మాత్రమే ప్రకటించారు గానీ రైతులు ఒక ఎకరంలో పంట పెట్టుబడి 20 నుండి 25000 లకు పైగా ఖర్చు పెడతారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన 10వేలు దేనికి సరిపోతాయని వారు ప్రశ్నించారు. ఈ యాసంగి సీజన్లో పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి బీభత్సం వల్ల వేలాది ఎకరాల్లో పంట నేల పాలు అయిందని, రైతులకు కోట్ల రూపాయల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఇదేనా అని వారు ప్రశ్నించారు.
వ్యవసాయం పట్ల సమగ్ర విధానం లేదు
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల సమగ్రమైన పద్ధతి లేదని, తుఫాను, అకాల వర్షాలు, కరువు కాటకాలు వచ్చినప్పుడు రైతులకు నష్టం వాటిల్లితే అనుసరించాల్సిన విధానం ప్రభుత్వం వద్ద లేదని రైతు సంఘాల నాయకులు విమర్శించారు. రైతులు పండించే పంటలకు బీమా చేయించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని, ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వర్షాల వల్ల కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రైతుల మాదిరిగా వారికి కూడా నష్టపరిహారం అందించాలని రైతు సంఘాల నాయకులు కోరారు. రైతు రుణమాఫీ అనేది ఒక ప్రసహనంగా మారిందని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు నీరుగారిపోయినట్లుగా, రుణమాఫీ అదే పద్ధతిలో ఉందని వారు ఎద్దేవా చేశారు. ఏకకాలంలోనే పంట రుణాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ధర్నా కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. ధర్నా అనంతరం రైతు సంఘాల నాయకులు అడిషనల్ కలెక్టర్ శ్రీ వాత్సవని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు, ఏఐకేఎస్ రాష్ట్ర సహాయం కార్యదర్శి వీరగోని శంకరయ్య, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్, అఖిలభారత కిసాన్ మహాసభ జిల్లా అధ్యక్షులు సుదమల్ల భాస్కర్, సంయుక్త కిసాన్ మహాసభ జిల్లా అధ్యక్షులు వల్లందాస్ కుమార్, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, నాయకులు ప్రభాకర్ వెంకటేశ్వరరావు, రాజేందర్ , ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న అప్పారావు, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.