BRS | వివాదాల్లో అధికార పార్టీ నేతలు

BRS | చేర్యాలలో ముత్తిరెడ్డి భూ కబ్జా స్వయంగా బయటపెట్టిన కుమార్తె రాజయ్యపై వేధింపుల ఆరోపణలు స్టేషన్‌ఘన్‌పూర్‌లో భారీ అవినీతి కడియం సంచనల వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు ఇలాగైతే వంద టార్గెట్‌ సాధ్యమేనా! విధాత, హైదరాబాద్‌ బ్యూరో: అధికార బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఎలా రావో చూద్దామని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ అయితే వందకు పైగా సీట్లు గెలువబోతున్నామని, దాదాపు సిట్టింగులందరికీ సీట్లు వస్తాయంటున్నారు. కానీ ఇటీవల అధికారపార్టీ […]

  • By: Somu    latest    Jun 26, 2023 12:35 AM IST
BRS | వివాదాల్లో అధికార పార్టీ నేతలు

BRS |

  • చేర్యాలలో ముత్తిరెడ్డి భూ కబ్జా
  • స్వయంగా బయటపెట్టిన కుమార్తె
  • రాజయ్యపై వేధింపుల ఆరోపణలు
  • స్టేషన్‌ఘన్‌పూర్‌లో భారీ అవినీతి కడియం సంచనల వ్యాఖ్యలు
  • సీఎం కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు
  • ఇలాగైతే వంద టార్గెట్‌ సాధ్యమేనా!

విధాత, హైదరాబాద్‌ బ్యూరో: అధికార బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఎలా రావో చూద్దామని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ అయితే వందకు పైగా సీట్లు గెలువబోతున్నామని, దాదాపు సిట్టింగులందరికీ సీట్లు వస్తాయంటున్నారు. కానీ ఇటీవల అధికారపార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై ఇంటా బయటా వస్తున్న విమర్శలు బీఆర్‌ఎస్‌ అధినేతకు కొత్త తలనొప్పులు సృష్టించేలా ఉన్నాయి. దళితబంధు పథకంలో కొందరు అవినీతికి పాల్పడ్డట్టు తన దృష్టికి వచ్చిందని సాక్షాత్తూ సీఎం కేసీఆరే అన్నారు.

ఆ ఒక్క పథకంలోనే కాదు విపక్ష నేతలు ఆరోపిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిపోయిందని, మీరు ఇచ్చిన ఆయుధంతోనే ఆ అవినీతి అంతమొందిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారపార్టీ ప్రజాప్రతినిధులపై ఆయన పరోక్షంగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇలా అనేక నియోజకవర్గాల్లో సొంత పార్టీలోనే నేతల మధ్య అగ్గిరాజుకుంటున్నది. ఇది ఇలా ఉండగా అధికారపార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తే.. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే.. పరువు నష్టం దాఖలు చేస్తామని అధినాయకులు బెదిరింపులకు దిగారు. కానీ.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తన తండ్రి అవినీతిని స్వయంగా బయటపెట్టారు.

చేర్యాల పట్టణంలో తన తండ్రి కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటికీ ఇస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ప్రకటించడం సంచలనం రేపింది. ఇవాళ 1200 గజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ఆమె తొలిగించారు. ఎమ్మెల్యే అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు, చేర్యాల ప్రజలు క్షమించాలని కోరారు.

బెల్లంపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పై మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఉదంతాలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్‌ నవ్వ చేసిన ఆరోపణలపై, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు స్పందించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాయి. తాజాగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి కులాలను కించపరిచేలా మాట్లాడారు. దీనిపై విపక్షాలు కాదు సొంతపార్టీ ఎమ్మెల్యే జోగు రామన్ననే ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతాను అన్నారు.

సొంతపార్టీ నేతలపై చర్యలకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డి గతంలో గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలా బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడమే కాదు.. తమ ప్రశ్నిస్తున్నజర్నలిస్టులు, ప్రజలను దూషించడం ఇప్పుడే కొత్త కాదు. గతంలోనూ చాలామంది నేతలు ఇలానే మాట్లాడారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలని సీఎం హెచ్చరిస్తున్నా నేతలు బేఖాతరు చేస్తున్నారు.

కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే తప్పులు చేస్తున్నా.. పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం వల్లనే అవే పరిస్థితులు పునరావృతమౌతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎం, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మౌనంగానే ఎందుకు ఉంటున్నారు? ఒకవేళ చర్యలు తీసుకుంటే వాళ్లు పార్టీ ఫిరాయిస్తారనే భయంతో అలా వ్యవహరిస్తున్నారా? లేదా తాము ఏం మాట్లాడినా, ఏం చేసినా ప్రశ్నించకూడదనే వైఖరితో ఉన్నారా? అని నెటీజన్లు సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

అధికారపార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వంద సీట్ల సంగతి తర్వాత మెజారిటీ మార్కు కష్టమే అని సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య విభేదాలు, కొందరు నేతలపై అవినీతి, కబ్జా ఆరోపణలు, ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళల ఫిర్యాదు వంటివి కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నదట.