కొత్త రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు.. నిరుద్యోగం పెరుగుతోంది: సచిన్ పైలెట్

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా, మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోందని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకుడు సచిన్ ఫైలెట్ అన్నారు

కొత్త రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు.. నిరుద్యోగం పెరుగుతోంది: సచిన్ పైలెట్
  • తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
  • ఏఐసీసీ నేత సచిన్ పైలెట్


విధాత: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా, మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోందని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకుడు సచిన్ ఫైలెట్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని అన్నారు.


భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని తెలిపారు. ఛత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ కి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. బీఆరెస్ ప్రభుత్వం ఏఒక్క హామీ నెరవేర్చలేదని, ఆపార్టీకి ప్రజల్లో మద్దతు లేదన్నారు. ఉద్యోగాలు లేకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండని ఆయన ప్రజలను కోరారు. రాజస్థాన్ లో ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉందని, సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్ లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కు ఎలాంటి సహకారం ఇవ్వకపోవడాన్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకుని ఓటేశారని అన్నారు.