రోడ్లకూ.. ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పాల్సిందేనా!.. వారు చెప్పిన రోడ్లకే మోక్షం!

విధాత‌: జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది ప్రజలూ, నాయకులూ కాదట.. ఎవరు చెప్పినా వినని జగన్ వీళ్ళు చెబితే మాత్రం వింటారట. వాళ్ళు ఏది చెబితే అది.. ఎలా చెబితే అలా అది వెంటనే అమలు చేస్తారని అంటున్నారు. వాళ్ళు చెబితే ఠక్కున చేస్తారని ప్రభుత్వంలో కొందరు పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇంతకూ అది ఎవరో కాదు.. ప్రభుత్వానికి రాజకీయ కన్సల్టెంట్‌గా ఉన్న ప్రశాంత్ కిశోర్ టీమ్ (ఐ ప్యాక్) అట. పార్టీ ఎక్క‌డెక్క‌డ బ‌ల‌హీనంగా ఉంది.. […]

  • Publish Date - February 20, 2023 / 09:05 AM IST

విధాత‌: జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది ప్రజలూ, నాయకులూ కాదట.. ఎవరు చెప్పినా వినని జగన్ వీళ్ళు చెబితే మాత్రం వింటారట. వాళ్ళు ఏది చెబితే అది.. ఎలా చెబితే అలా అది వెంటనే అమలు చేస్తారని అంటున్నారు. వాళ్ళు చెబితే ఠక్కున చేస్తారని ప్రభుత్వంలో కొందరు పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇంతకూ అది ఎవరో కాదు.. ప్రభుత్వానికి రాజకీయ కన్సల్టెంట్‌గా ఉన్న ప్రశాంత్ కిశోర్ టీమ్ (ఐ ప్యాక్) అట.

పార్టీ ఎక్క‌డెక్క‌డ బ‌ల‌హీనంగా ఉంది..

జగన్ను ఏదైనా అడగాలంటే ఆ పీకే టీమ్ మాత్రమే అడగగలడు అంటున్నారు. చివరికి ఏయే గ్రామాల్లో.. ఏయే నగరాల్లో రోడ్లు వేయాలన్నా.. పీకే టీమ్ చెబితేనే అవుతుందట.. వాస్తవానికి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019 మాదిరిగానే రానున్న ఎన్నికలకు కూడా పీకే టీమ్ జగన్‌కు సహకారం అందిస్తుంది. అంటే గ్రామాలూ.. జిల్లాలు.. నియోజకవర్గాల్లో ఐ ప్యాక్ టీమ్ తిరుగుతూ ప్రజా నాడిని గమనిస్తుంది. ఎక్క్కడెక్కడ జగన్ పార్టీ వీక్ ఉందొ చూస్తుంది.. దానికి గల రాజకీయ, పాలనాపరమైన కారణాలను గుర్తిస్తుంది

త‌క్ష‌ణ‌మే చేయాల్సిన ప‌నులు..

పార్టీ నాయకుల మధ్య గ్రూపుల తగాదాలనూ జగన్‌కు నివేదిస్తుంది. దీనికి విరుగుడు మంత్రాలనూ సూచిస్తుంది. ఏయే ఎమ్మెల్యే ఎక్కడ ఎందుకు వీక్‌గా ఉన్నదీ, ఆయన్ను వచ్చే ఎన్నికల్లో మార్చాలా లేదా.. ఆయనే ఉంటే గెలుస్తారా లేదా అనేది కూడా ఈ టీమ్ అధ్యయనం చేస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాలేదని జనం నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకున్న ఈ ఐ ప్యాక్ సభ్యులు రాష్ట్రంలో అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లను గుర్తించిందని అంటున్నారు…

జ‌గ‌న్ చెంత‌కు స‌మ‌స్య‌ల లిస్ట్‌..

అంటే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రోడ్లను గుర్తించింది అని.. ఆ లిస్ట్‌ను జగన్‌కు అందజేసింది అని అంటున్నారు.. ఈ మేరకు జిల్లా పరిషత్, ఆర్ అండ్ బి, ఇంకా మున్సిపల్ రోడ్లకు మరమ్మతులు చేస్తే తప్ప ప్రజలు శాంతించేది లేదని ఐ ప్యాక్ అంటోంది. ఆ రోడ్ల మరమ్మతులకు తక్షణమే నిధులు రిలీజ్ చేసేందుకు జగన్ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసారని అంటున్నారు. ఏదైతేనేం… ఎవరు చెబితేనేం.. రోడ్లు బాగుపడితే చాలు అని జనం అనుకుంటున్నారు.