Dr Reddy’s Labs | దేశంలో సనోఫీ టీకాలను పంపిణీ చేయనున్న రెడ్డీ ల్యాబ్స్..

Dr Reddy’s Labs | దేశంలో సనోఫీ టీకాలను పంపిణీ చేయనున్న రెడ్డీ ల్యాబ్స్..

Dr Reddy’s Labs : హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ దేశంలో సనోఫీ టీకాలను పంపిణీ చేయనుంది. ‘సనోఫి హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ (SHIPL)’ కంపెనీకి చెందిన టీకాలను మన దేశంలో పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ ఆ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పిల్లలు, పెద్దల కోసం సనోఫి ఉత్పత్తి చేస్తున్న టీకాలైన హెగ్జాజిమ్‌, పెంటాగ్జిమ్‌, టెట్రాగ్జిమ్‌, మెనక్ట్రా, ఫ్లూక్వాడ్రి, అడాసెల్‌, అవాగ్జిమ్‌ 80యూ బ్రాండ్ల టీకాలను డాక్టర్‌ రెడ్డీస్‌ పంపిణీ భారత్‌లో పంపిణీ చేస్తుంది.

ప్రస్తుతం ఈ బ్రాండ్ల వార్షిక అమ్మకాలు రూ.425 కోట్లకు పైనే ఉంటున్నాయి. ఈ టీకాల ఉత్పత్తి, దిగుమతి బాధ్యతలను సనోఫి హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ చూసుకుంటుంది. దేశీయంగా పంపిణీ, విక్రయాల బాధ్యతను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ తీసుకుంటుంది. దాంతో టీకాల అమ్మకం విభాగంలో రెండో స్థానంలోకి చేరే అవకాశం తమకు కలుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈవో (ఇండియా, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌) ఎంవీ రమణ తెలిపారు.

అదేవిధంగా సనోఫి హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీకి కూడా డాక్టర్‌ రెడ్డీస్‌ భాగస్వామ్యంతో మేలు జరగనుంది. భారతదేశంలో తమ అమ్మకాలు పెంచుకునేందుకు ఈ భాగస్వామ్య ఒప్పందం వీలుకల్పిస్తుందని సనోఫి ఇండియా జీఎం (వ్యాక్సిన్స్‌) ప్రీతి ఫుట్నాని తెలిపారు.