మంత్రి ఇట్లా.. సర్పంచులు అట్లా! కొనసాగుతున్న ఆత్మహత్యలు
నిరసన తెలిపిన సర్పంచులు మహర్ధశ అన్న మంత్రి ఎర్రబెల్లి పరస్పర విరుద్ధ వాదనలు ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్ విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌కు సమానమైన గ్రాంటును అదనంగా ఇస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వాదిస్తుండగా.. ప్రభుత్వ వాదనకు భిన్నంగా గ్రామ పంచాయతీలు సమస్యల వలయంలో చిక్కుకొని తల్లడిల్లుతున్నాయని సర్పంచులు మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం […]

- నిరసన తెలిపిన సర్పంచులు
- మహర్ధశ అన్న మంత్రి ఎర్రబెల్లి
- పరస్పర విరుద్ధ వాదనలు
- ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌కు సమానమైన గ్రాంటును అదనంగా ఇస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వాదిస్తుండగా.. ప్రభుత్వ వాదనకు భిన్నంగా గ్రామ పంచాయతీలు సమస్యల వలయంలో చిక్కుకొని తల్లడిల్లుతున్నాయని సర్పంచులు మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
బిల్లులు రాక ఉప సర్పంచ్ ఆత్మహత్య
మూడురోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామ ఉప సర్పంచ్ బాలినేని తిరుపతి (35) ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో దాదాపు రూ.11 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి మృతి చెందారు.
ఇలాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకముందే గ్రామపంచాయతీల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య గ్రామపంచాయతీలను బలిపెట్టి సర్పంచులను బలిపీట మెక్కిస్తున్నారని మండి పడుతున్నారు. భిన్న వాదనల మధ్య రాజకీయ విపక్షాల జోక్యంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడింది.
తాజాగా పంచాయతీల సమస్యపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. గ్రామపంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో తాజాగా హనుమకొండ కలెక్టరేట్ ముందు, వరంగల్ జడ్పీ వద్ద సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సర్పంచులు, మంత్రి మధ్య భిన్నాభిప్రాయాలిలా ఉన్నాయి.
కేంద్ర కొత్త చట్టంతో సర్పంచులకు సమస్య: మంత్రి ఎర్రబెల్లి
కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచుల అధికారాలను, నిధులను కేంద్రం తగ్గించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తప్పుడు మాటలతో బీజేపీ సర్పంచులను తప్పుదారి పట్టిస్తోందన్నారు. కేంద్రం చట్టం తెచ్చి స్థానిక సంస్థను ఇబ్బంది పెట్టింది. దీనివల్ల రాష్ట్ర అధికారాలు దెబ్బతిన్నాయి. కేంద్రం గతంలో ఇచ్చే గ్రాంట్‌ను తగ్గించింది. కేంద్రం ఇచ్చే గ్రాంట్‌కు సమానంగా కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుందని అన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ మాత్రమే ఇస్తున్నారన్నారు.
గతంలో రూ. 1830 కోట్లు కేంద్రం ఇచ్చేదని.. ఈ ఏడాది రూ. 500 కోట్లు తగ్గించిందన్నారు. ఈ ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదని మండి పడ్డారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మొత్తం గ్రాంట్ రూ.1202.75 కోట్లు. గ్రామానికి ఇచ్చేవి రూ.5 లక్షలు ఇప్పటి వరకు ఈ ఏడాది జిల్లా పరిషత్‌లకు రూ.86 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి నెలా రూ.256 కోట్లు విడుదల చేస్తున్నామని మంత్రి చెప్పారు.
అడుగంగా అడగంగా మొన్న రూ.700 కోట్లు కేంద్రం ఇచ్చిందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా రూ.330 కోట్లు విడుదల చేస్తే అందులో 50 శాతం రాష్ట్ర వాటా కాగా 50 శాతం కేంద్ర వాటా ఉంటుందన్నారు.
మొత్తం 12769 గ్రామ పంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు, ట్రాక్టర్ ఇచ్చామన్నారు. ట్రాక్టర్ భారం కాదు.. ఆదాయ మార్గం. హరిత హారానికి నీళ్ళ కోసం ప్రతి ట్రిప్‌కు గతంలో రూ.6 వేలు కిరాయి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు ట్రాక్టర్ ఉండడం వల్ల అన్ని డబ్బులు మిగులుతాయని, పైగా ఆదాయం వస్తుందని అన్నారు.
దేశంలో 19 అవార్డులు ఇస్తే రాష్ట్రానికి 18 వచ్చాయి. గతంలో సర్పంచ్ ల వేతనం రూ.1000 ఉంటే మనం దానిని రూ.6500కు పెంచాం. జడ్పీటీసిలకు 2,250 ఉండగా ఇప్పుడు 13,000 ఇస్తున్నాం. రోడ్ల కోసం రూ. 1800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సరిపోవు అంటే రూ.500 కోట్లు అదనంగా ఇచ్చారని మంత్రి చెప్పారు.
అభివృద్ధి మందగమనం…ఆర్థిక దిగ్బంధనం: గ్రామపంచాయతీ సర్పంచుల ఆవేదన
ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తమ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని సర్పంచుల నుంచి ఆవేదన వ్యక్తమైతోంది. అభివృద్ధి ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులతో గ్రామపంచాయతీలు తల్లడిల్లుతున్నాయని చెబుతున్న సర్పంచుల ఆవేదన వారి మాటల్లోనే….
కేంద్రం నుంచి తొమ్మిది నెలలుగా విడుదలవుతున్న నిధులను తమకు విడుదల చేయకుండా, ఐదు నెలలుగా రాష్ట్రనిధులు విడుదల చేయకుండా ఆర్థికపరమైన దిగ్బంధనం విధించారు. ఇప్పటివరకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. కేంద్రం నుంచి విడుదలైన నిధులను విద్యుత్ బకాయిల కింద జమ చేయడంతో తమ పరిస్థితి దయనీయంగా మారింది. కంట్రోల్ ఫండ్ ఇప్పటివరకు జమ చేయలేదు. దారి మళ్లించిన నిధులను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలి.
పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా నిధులు వినియోగించకూడదు. కానీ దీనికి భిన్నంగా తమ ఖాతాల్లోని నిధులను శని, ఆదివారాల్లో తమ దగ్గర ఉన్న డిజిటల్ కీలను ఉపయోగించుకొని అధికారుల సహకారంతో దారి మళ్ళించడం దౌర్భాగ్యం.
గ్రామపంచాయతీ సర్పంచుల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం సర్కారు పై ఉంది. లేకుంటే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు.
అనాథలైన ఉప సర్పంచ్ ఇద్దరు కూతుర్లు..
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు రావాల్సిన బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయి పురుగుల మందు తాగి ఉప సర్పంచ్ తిరుపతి(35) ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామంలో జరిగింది.
రాజకీయాల్లో భాగస్వామ్యమై ఊరికి ఎంతో కొంత చేద్దామనుకున్న యువకుడు అర్ధాంతరంగా ప్రాణాలు బలి పెట్టాడు. అప్పుల బాధతో కొద్ది నెలల క్రితం ఉప సర్పంచ్ భార్య సరిత, ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా మృతి చెందడంతో ఆయనపై ఆధార పడిన ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు.