పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేసే నేరస్థులపై కొరడా ఝలిపించిన సుప్రీం

'పిల్లల లైంగక వేధింపులకు సంబంధించిన వీడియోల'ను నేరంగా పరిగణించ కూడదంటూ ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి తప్పుపట్టడమే కాకుండా దారుణమైన తీర్పని వ్యాఖ్యానించింది

  • By: Somu    latest    Mar 15, 2024 12:22 PM IST
పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేసే నేరస్థులపై కొరడా ఝలిపించిన సుప్రీం

‘పిల్లల లైంగక వేధింపులకు సంబంధించిన వీడియోల’ను ప్రైవేటుగా తమతమ నివాస స్థలాలలో డౌన్లోడ్ చేసినా, చూసినా అలాంటి చర్యలను నేరంగా పరిగణించ కూడదంటూ ఇటీవల మద్రాసు హైకోర్టు పోక్సోచట్టం 2012 కింద న‌మోదైన‌ క్రిమినల్ కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి తప్పుపట్టడమే కాకుండా దారుణమైన తీర్పని వ్యాఖ్యానించింది.


మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానిని పునఃసమీక్షించి కొట్టివేయాలంటూ బాల హక్కుల పరిరక్షణ సంఘాలు ప్రత్యేకించి Just Rights For Children Alliance అనే NGOల సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి వాదనలువిన్న త‌రువాత‌ సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


దీంతో పిల్లల లైంగిక వేధింపుల వీడియోలను చూసే లక్షలాది మంది నేరస్తులకి తీవ్రమైన హెచ్చరికగా పరిగణించవచ్చు. నిజానికి లైంగిక వేధింపుల వీడియోలను తమతమ ఇండ్లలో ప్రైవేటుగా డౌన్ లోడ్ చేసుకున్నా, చూసినా కూడా అలాంటి వారు ఆధునిక టెక్నాలజీతో అనుసంధానించబడిన జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పోలీసు నిఘా సంస్థల నిరంతరం పర్యవేక్షణ నుండి, చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోలేరు.


జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ లో “స్పందనా కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెస్సివ్ ఎడ్యుకేషన్ (SCOPE)” ఓ భాగస్వామ్య సంస్థ. ఇది సంగారెడ్డి జిల్లాలో బాలల హక్కులతోపాటు, పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగా దాని అధ్యక్షులైన డాక్టర్ బండి సాయన్న సుప్రీంకోర్టు ఆదేశాల‌ను స్వాగతిస్తూ బాలలపై లైంగిక వేధింపులను అరికట్టే ఉద్యమంలో ఒక అద్భుతమైన ముందడుగా అభివర్ణించారు.


అలా 11 జనవరి, 2024న మద్రాస్ హైకోర్టు POCSO Act, 2012 కింద నమోదైన కేసును కొట్టివేయడం దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు ఆందోళనకు దారితీసింది. ఆ కేసు పూర్వపరాలలోకి వెళితే, చెన్నై పోలీసులు చెన్నైకి చెందిన ఒక 29 సంవత్సరాల యువకుడు తన మొబైల్ ఫోన్ లో పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలను డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నాడనే నేరంపై FIR నమోదు చేశారు. దానిని ఆ యువకుడు మద్రాస్ హైకోర్టులో సవాల్ చేయగా, మద్రాస్ హైకోర్టు ఎవరైనా ప్రైవేటుగా అటువంటి చిత్రాలను డౌన్ లోడ్ చేసుకన్నా, చూసినా అది నేరంగా పరిగణించడానికి వీలు లేదని, సదరు ముద్దాయి ప్రత్యక్షంగా పిల్లలను వేధించలేదని, కేవలం ప్రైవేటుగా తాను డౌన్ లోడ్ చేసుకున్న బాలల లైంగిక అశ్లీల చిత్రాలను ఎవరికీ షేర్ చేయలేదని, పబ్లిక్ గా చూడనందున అతని చర్యలను కేవలం నైతికపతనంగా చూడవచ్చు కానీ, నేరంగా పరిగణించరాదని, అది POCSO చట్టం పరిధిలోకి రాదని, నేరం కాదంటూ FIR ను కొట్టివేసింది.


అలా కొట్టవేయడాన్ని పలు పౌర, ప్రజాస్వామిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అందులో భాగంగానే బాలల హక్కుల కోసం దేశ వ్యాప్తంగా పనిచేసే 120 స్వచ్ఛంద సంస్థలు(NGOs)Just Rights for Children Alliance పేరున ఒక సమాఖ్యగా ఏర్పడి బచ్పన్ బచావో ఆందోళన్ తో కలిసి మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.


మద్రాస్ హైకోర్టు తీర్పు మూలంగా పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసుకున్న, చూసినా అది ఏ మాత్రం నేరం కాదనే భావన సమాన్య ప్రజల్లో కలిగిందని, తద్వారా పిల్లల అశ్లీల చిత్రాలకు డిమాండ్ పెరిగి, పిల్లలపై లైంగిక వేదింపులు పెరగడానికి, మరింతగా పిల్లలను అలాంటి వాటికి వినియోగించడానికి దారితీస్తుంది కాబట్టి సదరు హైకోర్టు తీర్పు అసాంఘీక చర్యలకు, పిల్లలపై మరింత వేధింపులకు ఊతం ఇస్తుందని, అట్టి తీర్పును సమీక్షించి కొట్టివేయాలని, ఆ తీర్పును సవాల్ చేసి తమ వాదనలను వినిపించడానికి థర్డ్ పార్టీలైన తమకు అనుమతించాలని సదరు NGOs సమాఖ్య వాదించింది. వారి వాదనలు విన్న సుప్రీంకోర్టు వారి వాదనతో ఏకీభవిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.


ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్క మాట్లాడుతూ, Just Rights for Children Alliance ఈ క్రిమినల్ కేసులో ప్రత్యక్షంగా విక్టిమ్ కాకున్నా, సాంకేతికంగా థర్డ్ పార్టీ ఐనప్పటికీ మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించడం విశేషమైనదని, అది సుప్రీంకోర్టు తీర్పులలో మరో మైలురాయి లాంటిదని విశ్లేషించారు.


నేషనల్ క్రైం బ్యూరో నివేదికల ప్రకారం పిల్లల లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాలకు సంబంధిచిన నేరాలు 2018లో 44 నమోదుకాగా, అవి 2022 నాటికి 1171 గా నమోదయ్యాయి. అలా పిల్లలపై లైంగిక వేదింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ వైఖరి శ్లాఘనీయమైనదనే సర్వత్రా వ్యక్తమౌతుంది.


డాక్టర్ బండి సాయన్న, అధ్యక్షుడు, స్కోప్ సంస్థ