మా నాన్న లైఫ్ గార్డ్.. సెక్యూరిటీ గార్డ్ కాదు.. ఓ కూతురి భావోద్వేగం ఇదీ..

త‌మ పిల్ల‌లు త‌మ‌లా గాడిద క‌ష్టం చేయ‌కూద‌డ‌ని ప్ర‌తి పేద తండ్రి క‌ల‌లు కంటాడు. బిడ్డ‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించి, ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తి తండ్రి ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతుంటాడు.

  • By: Somu    latest    Feb 28, 2024 11:28 AM IST
మా నాన్న లైఫ్ గార్డ్.. సెక్యూరిటీ గార్డ్ కాదు.. ఓ కూతురి భావోద్వేగం ఇదీ..

విధాత: త‌మ పిల్ల‌లు త‌మ‌లా గాడిద క‌ష్టం చేయ‌కూద‌డ‌ని ప్ర‌తి పేద తండ్రి క‌ల‌లు కంటాడు. బిడ్డ‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించి, ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తి తండ్రి ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతుంటాడు. అలా ప్ర‌తిక్ష‌ణం త‌న బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం గురించి ఆలోచిస్తుంటారు తండ్రులు. చివ‌ర‌కు త‌మ క‌ష్టానికి త‌గ్గ‌ట్టుగా పిల్ల‌లు ప్ర‌యోజ‌కులై.. వారిని ప‌ది మంది ప్ర‌శంసిస్తుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది. అప్పుడు తండ్రిబిడ్డ‌ల‌కు క‌న్నీటి చుక్క‌ల‌కు బ‌దులుగా ఆనంద భాష్పాలు రాలుతాయి. ఇలాంటి దృశ్యం.. ఓ సెక్యూరిటీ గార్డు, ఆయ‌న బిడ్డ మ‌ధ్య ఆవిష్కృత‌మైంది.

ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేస్తూ.. త‌న బిడ్డ‌ను గొప్ప‌గా చ‌దివించాడు. ధ‌న్‌శ్రీ జీ అనే అమ్మాయి ఇంగ్లండ్‌లోని ఓ ప్ర‌తిష్టాత్మ‌క యూనివ‌ర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యుయేష‌న్ డే వేడుక‌ల్లో ఆమె డిగ్రీ ప‌ట్టాను పుచ్చుకున్న సంద‌ర్భంగా ఎమోష‌న్‌కు గురైంది. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ క్లిప్‌కు క్యాప్షన్‌లో నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు పప్పా అని ధన్‌శ్రీ జి రాశారు. తండ్రీకుమార్తెల మ‌ధ్య హార్ట్‌ఫెల్ట్ హగ్‌తో ఆ వీడియో ప్రారంభ‌మ‌వుతోంది. విమానాశ్ర‌యంలో తండ్రి త‌న‌కు వీడ్కోలు ప‌లికిన దృశ్యాన్ని కూడా అందులో ఉంచింది. ఇక యూకే యూనివ‌ర్సిటీలో డిగ్రీ ప‌ట్టా తీసుకునేందుకు గ్రాడ్యుయేష‌న్ డ్రెస్‌కోడ్‌లో వెళ్లిన దృశ్యాల‌ను, డిగ్రీ ప‌ట్టా పుచ్చుకున్న ఆ ఆనంద‌క‌ర క్ష‌ణాల‌ను కూడా ఇన్‌స్టా వీడియోలో షేర్ చేశారు. ఇక వీడియోలోని ఇలా రాసి ఉంది. మీరు సెక్యూరిటీ గార్డ్.. మీ కుమార్తెను విదేశాల‌కు పంప‌లేరు.. అని చాలా మంది ఎగ‌తాలి చేశారు. కానీ మా నాన్న నాకు లైఫ్ గార్డ్.. అది చేసి నిరూపించాడు అని కూతురు ధ‌న్‌శ్రీ పేర్కొన్నారు.

ఈ తండ్రీకుమార్తెల హార్ట్‌ఫెల్ట్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 మిలియ‌న్ల మంది వీక్షించారు. 1.8 మిలియ‌న్ల మంది లైక్ చేశారు. ఈ వీడియో ఎంతో ప్రేర‌ణ‌ను ఇచ్చింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. మీకు, మీ తండ్రికి ఆ దేవుడు మ‌రింత శ‌క్తిని ఇవ్వాల‌ని పేర్కొన్నారు. మీ నాన్న నిజ‌మైన హీరో అని నెటిజ‌న్లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.