Sharad Pawar | NCP అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా

Sharad Pawar ఎన్నికల్లో పోటీచేసేది లేదన్న ‘మహా’ దిగ్గజ నేత విధాత: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకున్నది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్‌ రాజకీయ వేత్త, మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్‌పవార్‌ (Sharad Pawar) రాజీనామా చేశారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రెండు దశాబ్దాలకుపైగా ఆయన ఎన్సీపీ చీఫ్‌గా కొనసాగారు. మంగళవారం తన ఆత్మకథ ‘లోక్‌ మాజీ సంగటి’ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘ఎన్సీపీ అధ్యక్ష పదవి […]

Sharad Pawar | NCP అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా

Sharad Pawar

  • ఎన్నికల్లో పోటీచేసేది లేదన్న ‘మహా’ దిగ్గజ నేత

విధాత: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకున్నది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్‌ రాజకీయ వేత్త, మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్‌పవార్‌ (Sharad Pawar) రాజీనామా చేశారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రెండు దశాబ్దాలకుపైగా ఆయన ఎన్సీపీ చీఫ్‌గా కొనసాగారు.

మంగళవారం తన ఆత్మకథ ‘లోక్‌ మాజీ సంగటి’ ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటున్నాను’ అని ప్రకటించారు. ఆయన ప్రకటనతో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది.

దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నానన్న పవార్‌.. ఎక్కడో ఒక చోట ముగింపు పలకక తప్పదని చెప్పారు. ఇకపై ఎన్నికల్లో కూడా పోటీచేయబోనని తెలిపారు. ‘రాజ్యసభ సభ్యుడిగా నాకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది. ఆ తదుపరి నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఈ మూడేళ్లు రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న కీలక అంశాలపై మరింత దృష్టి కేంద్రీకరిస్తాను’ అని ఆయన చెప్పారు. అదనపు బాధ్యతలేవీ తీసుకోబోనని తెలిపారు.

అయితే.. రాజకీయాల నుంచి తప్పుకోనని చెప్పారు. ‘పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటున్నప్పటికీ ప్రజా జీవితం నుంచి వైదొలిగేది లేదు’ అని స్పష్టం చేశారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో సభలోని పార్టీ నేతలు సహా అంతా పవార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మద్దతుదారులు వేదికపైకి చేరుకుని, పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగొద్దని చేతులు జోడించి పవార్‌కు విన్నవించారు.పార్టీ చీఫ్‌గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని పవార్ చెప్పారు

అంతర్గత రాజకీయాలతో ఎన్సీపీ కొంతకాలంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఎన్సీపీలో కీలక నేత, శరద్‌పవార్‌ మేనల్లుడు అజిత్‌పవార్‌ బీజేపీతో చేతులు కలుపుతారని వార్తలు వచ్చాయి. వాటిని అజిత్‌పవార్‌ ఖండించినా.. అంతర్గతంగా పార్టీ సంక్షోభంలో ఉన్నదన్న సంకేతాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శరద్‌పవార్‌ రాజీనామా చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.