మాజీ ప్ర‌ధాన‌మంత్రి ర్యాలీకి సింహం, పులి.. పాకిస్థాన్‌లో విచిత్ర ఘ‌ట‌న

ఆర్థిక ఇబ్బందులు, ఉగ్ర‌వాదంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ లో వింత ఘ‌ట‌న‌లకు కొదవ లేదు

మాజీ ప్ర‌ధాన‌మంత్రి ర్యాలీకి సింహం, పులి.. పాకిస్థాన్‌లో విచిత్ర ఘ‌ట‌న

విధాత‌: ఆర్థిక ఇబ్బందులు, ఉగ్ర‌వాదంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) లో వింత ఘ‌ట‌న‌లకు కొదవ లేదు. తాజాగా ఆ దేశ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్.. నిర్వ‌హించిన భారీ ర్యాలీలో క‌నిపించిన ఒక స‌న్నివేశం ప్ర‌పంచం దృష్టి ఆక‌ర్షించింది. ఆ పార్టీ మ‌ద్ద‌తుదారులు కొంద‌రు నిజ‌మైన సింహం, పులుల‌ను తీసుకువ‌చ్చి వాటితో స‌హా ర్యాలీలో పాల్గొన్నారు. ఒక పులిని, ఒక సింహాన్ని చిన్న చిన్న బోనుల్లో పెట్టి.. వాహనాల‌పై ఎక్కించి త‌మ‌తో పాటు ర్యాలీ మొత్తం తీసుకెళ్లారు.


ష‌రీఫ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పీఎంఎల్‌-ఎన్ పార్టీ జెండాపై పులి గుర్తు ఉంటుంది. దీనిని సూచించ‌డానికే వారు ఈ అడ‌వి జంతువుల‌ను ఇలా రోడ్ల‌పైకి తీసుకొచ్చార‌వ‌ని భావిస్తున్నారు. వీటితో ష‌రీఫ్‌కి ఆహ్వానం ప‌లికి.. ఆయ‌న‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేయాల‌న్న‌దే ఈ కార్య‌క‌ర్త‌ల ఆలోచ‌న‌గా స్థానిక రాజ‌కీయ విశ్లేష‌కుడు ఒక‌రు వివ‌రించారు. ఈ ర్యాలీలో పులి, సింహంతో సెల్ఫీలు తీసుకోవ‌డానికి కార్య‌క‌ర్త‌లు, రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న వారు పోటీ ప‌డ్డారు.


దీనిపై అంత‌ర్జాతీయ మీడియాలోనూ వార్త‌లు రావ‌డం, జంతు ప్రేమికుల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో పీఎంఎల్‌-ఎన్ పార్టీ నాయ‌కురాలు, న‌వాజ్ ష‌రీఫ్ కుమార్తె.. మ‌రియం ష‌రీఫ్ స్పందించారు. ఆ జంతువుల‌ను ఒక కార్యక‌ర్త అత్యుత్సాహం కొద్దీ తీసుకొచ్చార‌ని.. తాము చూసిన వెంట‌నే వాటిని పంపించేశామ‌ని వెల్ల‌డించారు. ఏ రాజ‌కీయ ర్యాలీలోనూ మూగ‌జీవాలు హింస‌కు గురి కాకూడద‌ని ఆమె అన్నారు.


మ‌రో వైపు ఎన్ఏ-130 అనే ప్రాంతంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో న‌వాజ్ ష‌రీఫ్ మాట్లాడుతూ.. తాను ఫిబ్ర‌వ‌రి 8న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌ధానమంత్రి ప‌ద‌వికి పోటీప‌డుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌ను ప‌ద‌వి నుంచి దింపేయ‌డం వ‌ల్లే పాకిస్థాన్ అధోగ‌తి పాలైంద‌ని పేర్కొన్నారు. దేశాన్ని అణుశ‌క్తిగా మార్చిన త‌న‌ను జైలు పాలు చేయాల‌నుకోవ‌డం ఏ ర‌కంగా స‌మ‌ర్థ‌నీయ‌మ‌ని ప్ర‌శ్నించారు.