ఇంకా ఫ్రీజింగ్‌లోనే.. మునుగోడు గొర్రెల డబ్బులు!
అకౌంట్లో చిక్కుకుపోయిన ధాన్యం డబ్బులు, రైతుబంధు సొమ్ము ! రగిలిపోతున్న లబ్ధిదారులు యాసంగి పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన విధాత: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా యాదవ ఓటర్లకు గాలం వేసే నేపథ్యంలో ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని చెప్పి ఎన్నికల్లో గెలిచి రెండు నెలలైనా ఇదిగో అదిగో అంటూ గొర్రెల పంపిణీలో జాప్యం చేస్తుండటం లబ్ధిదారులను అసహనానికి గురిచేస్తుంది. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించే లక్ష్యంతో అన్ని […]

- అకౌంట్లో చిక్కుకుపోయిన ధాన్యం డబ్బులు, రైతుబంధు సొమ్ము !
- రగిలిపోతున్న లబ్ధిదారులు
- యాసంగి పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
విధాత: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా యాదవ ఓటర్లకు గాలం వేసే నేపథ్యంలో ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని చెప్పి ఎన్నికల్లో గెలిచి రెండు నెలలైనా ఇదిగో అదిగో అంటూ గొర్రెల పంపిణీలో జాప్యం చేస్తుండటం లబ్ధిదారులను అసహనానికి గురిచేస్తుంది.
ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించే లక్ష్యంతో అన్ని అస్త్రాలను ప్రయోగించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం యాదవ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు మొదటి విడత గొర్రెల పంపిణీ పథకానికి భిన్నంగా రెండో విడత పథకాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు గా ప్రకటించింది.
ఇందులో భాగంగా గొర్రెల పంపిణీ పథకంలో డీడీలు చెల్లించిన 6981 మంది లబ్ధిదారులకు 93 కోట్ల 73 లక్షల 60వేలు వారి ఖాతాల్లో ప్రభుత్వం వేసింది. పోలింగ్ కు రెండు వారాల ముందే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో గొర్రెల పథకం డబ్బులను వేసిన ప్రభుత్వం ఆ డబ్బుతో తమకు నచ్చిన చోట గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పినప్పటికీ ఎన్నికల కోడ్ అంటూ లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు ఫ్రిజ్ చేసింది.
ఎన్నికల కోడ్ ముగిశాక అకౌంట్ ఫ్రిజ్ ఎత్తివేస్తారని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే ఎదురయింది. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలైనా నేటికీ అకౌంట్ల ఫ్రీజింగ్ ఎత్తివేకపోవడంతో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అలాగే మురిగిపోతున్నాయి.
దీనికి తోడు చాలా మంది లబ్ధిదారులకు వారు అమ్ముకున్న ధాన్యం డబ్బులు, వారి రైతుబంధు డబ్బులు కూడా అదే అకౌంట్లలో పడటంతో అకౌంట్ల ఫ్రీజ్ కారణంగా ఆ డబ్బులను ఉపయోగించుకోలేక పోతున్నారు. దీంతో యాసంగి పంటల సాగు పెట్టుబడికి సైతం వారు తిప్పలు పడే పరిస్థితి నెలకొంది.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల పిదప ఈ నెల 6వ తేదీన రెండోసారి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ గొర్రెల పంపిణీ పథకం అకౌంట్ ల ఫ్రీజింగ్ పై ఎలాంటి ప్రకటన చేయకపోవడం లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులు తమ వాటాగా 43,700 చొప్పున డిడి చెల్లించారు. వారికి ప్రభుత్వం ఒక లక్ష 58 వేల రూపాయలు మంజూరు చేస్తుంది. పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలతో పాటు ఇన్సూరెన్స్ ట్రాన్స్ పోర్టు వసతి అందిస్తుంది.
కాగా మునుగోడు రెండో విడత గొర్రెల పంపిణీ జాప్యంపై రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించిన సందర్భంగా స్పందిస్తూ మునుగోడు నియోజకవర్గంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు డబ్బులు అందిస్తామని, వారు తమకు నచ్చిన చోట గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ పునరుద్ఘాటించారు.
మునుగోడు గొర్రెల పథకం లబ్ధిదారుల అకౌంట్ల ఫ్రీజింగ్ ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాలు అనవసరంగా లబ్ధిదారులను రెచ్చగొడుతున్నాయని బాలరాజు యాదవ్ విమర్శించారు. అయితే బాలరాజ్ యాదవ్ జిల్లాకు వచ్చి వెళ్లి ఐదు రోజులు గడిచిపోయిన గొర్రెల పంపిణీపై ఎలాంటి పురోగతి కనిపించలేదు.
మునుగోడు నియోజకవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం పై నల్గొండ జిల్లా పశువైద్య శాఖ డిడి యాదగిరి వివరణ ఇస్తూ ప్రభుత్వం నుండి ఈ విషయమై గైడ్లైన్స్ జారీలో జాప్యం జరుగుతుందని వారం రోజుల్లోగా గైడ్లైన్స్ విడుదల కావచ్చని ఆ వెంటనే గొర్రెల పంపిణీ డబ్బులను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.