జమ్మికుంటలో బీఆర్ఎస్ కు షాక్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక సంఘ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మొత్తం 30 మంది సభ్యులు కలిగిన పురపాలక సంఘంలో 20 మంది

జమ్మికుంటలో బీఆర్ఎస్ కు షాక్

– 13 మంది కౌన్సిలర్ల రాజీనామా

– కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ పయనం

– మంతనాలు జరుపుతున్న చైర్మన్, వైస్ చైర్మన్

– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమావేశానికి ముఖం చాటేసిన ఇరువురు నేతలు

విధాత త బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక సంఘ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మొత్తం 30 మంది సభ్యులు కలిగిన పురపాలక సంఘంలో 20 మంది సభ్యులు చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఈనెల 25న వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్న సంబరం నుండి స్థానిక శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి తేరుకోక మునుపే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన వెంటనే మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుతో కలసి జమ్మికుంట పురపాలక సంఘంపై మళ్లీ గులాబీ జెండా ఎగరేసాం అంటూ సంబరపడ్డ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి.. చైర్మన్, వైస్ చైర్మన్ గట్టి షాక్ ఇచ్చారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి బీఆర్ఎస్ లో చేరిన చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని కోటి తిరిగి తమ మాతృ సంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం హుజురాబాద్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశానికి వీరు డుమ్మా కొట్టారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వీరి చేరిక పట్ల అంత సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన బల్మూరి వెంకట్ సహకారంతో పార్టీలో చేరేందుకు వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా వీరిరువురూ అనారోగ్య కారణాలు సాకుగా చూపి మంగళవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరుకాకుండా హైదరాబాద్ తరలి వెళ్లారు.

– బీఆర్ఎస్ కు 13 మంది కౌన్సిలర్ల రాజీనామా

ఇదిలా ఉండగా బుధవారం జమ్మికుంట పురపాలక సంఘంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన 13 మంది కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వెనువెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకుగాను హైదరాబాద్ తరలి వెళ్లారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినవారిలో బొంగోని వీరన్న, మారపల్లి బుచ్చయ్య, మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప, పిట్టల శ్వేత, పొన్నగంటి సారంగా, పొన్నగంటి రాము, బిట్ల కళావతి, కూతాడి రాజయ్య, దేశిని రాధ, జీ పూలమ్మ, దిడ్డి రామ్మోహన్, రావి కంటి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ పురపాలక సంఘంలోని 30 వార్డు కౌన్సిల్ పదవులకు గాను 28 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గులాబీ పార్టీ నుండి ఇటీవలే ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జమ్మికుంట పురపాలక సంఘంలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 16కు చేరుకుంది. పురపాలక సంఘ చైర్మన్ రాజేశ్వరరావు అవినీతి, అధికార దుర్వినియోగం, ఒంటెద్దు పోకడలు, ఆయనను కట్టడి చేయడంలో శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి వైఫల్యాలకు నిరసనగా తామంతా గులాబీ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని 13 మంది కౌన్సిలర్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తాము పార్టీని వీడడం జమ్మికుంట పట్టణ అభివృద్ధికి సహకరిస్తుందని, ప్రజలు అర్థం చేసుకోవాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యుడు సర్వశక్తులు ఒడ్డి, అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయడంలో సఫలీకృతుడైనా, చివరకు పార్టీ కౌన్సిలర్లు ఆయనకు తమదైన మార్క్ రుచి చూపించారు.