Shri Lakshmi Narasimha swami: పోలీస్ స్టేషన్ సందర్శించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
రికార్డులను తనిఖీ చేసిన స్వామి వారు అనంతరం దేవదేవులకు ప్రత్యేక పూజలు చేసిన పోలీసు అధికారులు Shri Lakshmi Narasimha swami visit police station విధాత బ్యూరో కరీంనగర్: దేవ, దేవుడే స్వయంగా పోలీస్ స్టేషన్(police station)కు వెళ్లి రికార్డులు పరిశీలిస్తే.. అంతకంటే మహాభాగ్యం ఇంకేదైనా ఉంటుందా.. దేవుడు ఏంటి? పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? అయితే ఇది ముమ్మాటికి నిజం.. దేశంలో మరే ఆలయంలో కనిపించని ఆచారం. జగిత్యాల […]

- రికార్డులను తనిఖీ చేసిన స్వామి వారు
- అనంతరం దేవదేవులకు ప్రత్యేక పూజలు చేసిన పోలీసు అధికారులు
Shri Lakshmi Narasimha swami visit police station
విధాత బ్యూరో కరీంనగర్: దేవ, దేవుడే స్వయంగా పోలీస్ స్టేషన్(police station)కు వెళ్లి రికార్డులు పరిశీలిస్తే.. అంతకంటే మహాభాగ్యం ఇంకేదైనా ఉంటుందా.. దేవుడు ఏంటి? పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? అయితే ఇది ముమ్మాటికి నిజం.. దేశంలో మరే ఆలయంలో కనిపించని ఆచారం.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha swami) ఆలయంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రికార్డు(Records)లను తనిఖీ చేసి, శాంతిభద్రతల అంశాలను పర్యవేక్షించి, ఘనంగా పూజలు అందుకుంటారు. దేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సనాతన సంప్రదాయం, ఆచారం, అనాదిగా ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతున్నది. సాక్షాత్తూ ఆ దేవదేవుడే తన చతురంగ బలగాలతో పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసు అధికారులు, సిబ్బందితో పూజలు అందుకోవడం ధర్మపురి పుణ్యక్షేత్రంలో మాత్రమే ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతోంది. ఈ అపరూప ఘట్టం కోసం పోలీసు కుటుంబాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
బ్రహ్మోత్సవాలలో లక్ష్మీసమేతుడైన నృసింహస్వామి కళ్యాణానంతరం జలవిహారం చేసి లోకంలో శాంతిభద్రతల పర్యవేక్షణకై దక్షిణ దిగ్యాత్రకై గురువారం బయలుదేరారు. దీనిలో భాగంగా పట్టణానికి దక్షిణాన ఉన్న పోలీసు ఠాణాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కుటుంబాల మహిళలు, సిబ్బంది మంగళహారతులతో స్వాగతం పలుకగా ఇంటెలిజెన్సీ ఎస్పీ రాజ మహేంద్ర నాయక్, జగిత్యాల, మెట్ పల్లి డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, సీఐలు బిల్లా కోటేశ్వర్, రాజశేఖరరాజు, ఎస్సైలు ఏలూరి కిరణ్ కుమార్, రామకృష్ణ తదితర పోలీసు అధికారులు స్వామివారి సేవాపల్లకిని స్వయంగా భుజాలపై మోసుకుంటూ ఠాణాకు చేరుకున్నారు.
ఠాణా ఆవరణలో ప్రత్యేక పూలాలంకరణ చేసిన వేదిక వద్దకు స్వామివారిని తోడ్కొని వచ్చారు. దేవస్థానం వేదపండితులు, అర్చకులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దారిపొడవునా మహిళలు, భక్తులు మంగళహారతులతో హారతి పలికారు. ఒగ్గుడోలు బృందాల నృత్యాలు, డీజే చప్పుళ్లతో లక్ష్మీ నరసింహ స్వామి స్టేషన్ కు రాగా పోలీసు కుటుంబ మహిళలు హారతులిచ్చి స్వాగతించారు. కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ ఎం ట్రస్టు చైర్మన్ స్నేహలత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, రేనివేషన్ కమిటి అధ్యక్షులు ఇందారపు రామయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ పాల్గొన్నారు.