ఊపందుకుంటున్న ‘ఒంటరి మహిళ’ ఉద్యమం..
'IAM SINGLE' నినాదం ‘సగర్వంగా ప్రకటించు.. మేం ఒంటరి మహిళలం’ అని నినదిస్తున్న మహిళలు విధాత: ఈ మధ్య ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఓ సమావేశం జరిగింది. అది ఒంటరి మహిళల సమావేశం. ఫేస్‌బుక్‌లో ‘స్టేటస్ సింగిల్’ పేరుతో ఉన్న గ్రూపు సభ్యులు వారంతా. ఇప్పటి దాకా ఈ సమాజంలో ‘ఒంటరి మహిళలు’ అంటే ఉన్న తిరస్కార భావాన్ని, తక్కువ చేసి చూసే భావనను ఎదరించటమే లక్ష్యంగా ఈ ‘కూటమి’ ఏర్పాటయ్యింది. ఈ సమావేశానికి ఢిల్లీ నలుమూలల […]

- ‘IAM SINGLE’ నినాదం
- ‘సగర్వంగా ప్రకటించు.. మేం ఒంటరి మహిళలం’ అని నినదిస్తున్న మహిళలు
విధాత: ఈ మధ్య ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఓ సమావేశం జరిగింది. అది ఒంటరి మహిళల సమావేశం. ఫేస్‌బుక్‌లో ‘స్టేటస్ సింగిల్’ పేరుతో ఉన్న గ్రూపు సభ్యులు వారంతా. ఇప్పటి దాకా ఈ సమాజంలో ‘ఒంటరి మహిళలు’ అంటే ఉన్న తిరస్కార భావాన్ని, తక్కువ చేసి చూసే భావనను ఎదరించటమే లక్ష్యంగా ఈ ‘కూటమి’ ఏర్పాటయ్యింది. ఈ సమావేశానికి ఢిల్లీ నలుమూలల నుంచీ 25 మందికి పైగా హాజరయ్యారు.
‘మేం ఒంటరి’ అనేదే నినాదం..
‘గర్వంగా చెప్పుకొందాం.. మేం ఒంటరి’ అనేదే వీరి నినాదం. మహిళలు ఒంటరిగా ఉండటానికి ఎందుకు వీలు లేదని వారు నిలదీస్తున్నారు. స్త్రీ అనగానే, ఎల్లప్పుడూ ఏదో రూపంలో పురుషుని సంరక్షణలో, నీడలో ఉండాలని అంటున్నారు, దీనికి మేం వ్యతిరేకం.
‘భర్త చనిపోయినా, విడాకులు పొందినా, అవివాహితులుగానే ఉన్నా మేమంతా.. ఆత్మగౌరవం గల మనుషులుగా, మహిళలుగా సగర్వంగా ప్రకటించుకొంటాం, మేం ఒంటరి అని నినదిస్తాం’ అని అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీకి మాత్రమే పరిమితమైనా.. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాలన్నింటా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, సంఘటితం చేస్తామని ప్రకటిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో స్త్రీ అంటే..
భారతీయ సంస్కృతిలో స్త్రీ అంటే… తల పైకెత్తకుండా నడుచుకుంటూ పోయే బాలిక, మంచి భార్య, బాధ్యతాయుతమైన తల్లి అనే. కానీ ఏ కారణం చేతనైనా ఆ మహిళ ఒంటరి అయితే.. ఆమె అపశకునమే. భర్త చనిపోతే ‘విధవ’రాలు, భర్తనుంచి విడాకులు తీసుకుంటే ‘తిరుగుబోతు’, పెండ్లి అనేదే వద్దంటే.. ‘పొగరుబోతు’ అని పేర్లు పెట్టి అవహేళన చేస్తున్నారు. అంతే కాదు, కుటుంబ జీవనానికి, సంస్కృతికి హాని తలపెట్టేవారిగా ఈసడించుకుంటున్నారు.
ఆధునిక జీవన సరళీ ప్రధాన కారణం..
ఆధునిక నవనాగరిక సమాజంలో గతంతో పోలిస్తే..ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దీనికి సామాజిక, ఆర్థిక కారణాలతో పాటు, పెరిగిన ఆధునిక జీవన సరళి కూడా ప్రధాన కారణం. నేడు మగ పిల్లాడితో సమానంగా ఆడ పిల్లను చదివిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా చదువులపై శ్రద్ధతో ఉంటున్నారు.
ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు అర్హత సాధిస్తున్నారు. ఈ క్రమంలో జీవితంలో స్థిరపడి, కుటుంబ బాధ్యతలన్నీ తీరిన తర్వాత పెండ్లి గురించి ఆలోచిద్దామనుకున్న వారు, ఆ తర్వాత కాలంలో ‘ఇంకేం చేసుకుంటాం లే పెండ్లి’ అనేదాకా పోతున్నారు. ఇలాంటి వారే ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తున్నది కూడా ఒక వాస్తవ పరిస్థితి.
2001లో 5 కోట్లు ఉంటే.. 2011లో 7కోట్ల పైనే..
ఏ కారణం చేత నైనా కావొచ్చు… దేశ వ్యాప్తంగా ఒంటరి మహిళల సంఖ్య 2011 లెక్కల ప్రకారం.. 7 కోట్లకు పైనే ఉంటారు. అదే ఈ సంఖ్య 2001లో 5 కోట్లే ఉన్నది. అంటే.. క్రమంగా.. ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న స్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే… ఒంటరి మహిళల హక్కుల పరిరక్షణతో పాటు, సామాజిక గౌరవం, గుర్తింపు సమస్య కూడా ముందుకు వస్తున్నది. కాబట్టి ఒంటరి మహిళలకు అన్ని విధాలా సామాజిక సమానత్వంతో పాటు, సాంఘిక హోదా కూడా దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.