అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌.. నేతల రియాక్షన్ ఇదే

అయోధ్య రామాలయానికి రావాలంటూ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించింది. హైకమాండ్‌పై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు

అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌.. నేతల రియాక్షన్ ఇదే

Ayodhya | అయోధ్య రామాలయానికి రావాలంటూ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించింది. హైకమాండ్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అర్జున్‌ మోద్వాడియా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన రాముడు మా ఆరాధ్యదైవం అంటూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన పోస్టును ట్యాగ్‌ చేశారు.


ఇది దేశ ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయమన్నారు. రామ మందిరం విషయంలో కాంగ్రెస్ రాజకీయ నిర్ణయాలు తీసుకోరాదన్నారు. మరో నేత ఆచార్య ప్రమోద్‌ కృష్ణం స్పందిస్తూ.. శ్రీరామ ఆలయ ఆహ్వానాన్ని తిరస్కరించడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమేనన్నారు. హృదయ విదారకంగా ఉందన్నారు.


అయోధ్య రామాలయానికి రావాలంటూ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌.. ఎందుకు రాలేకపోతున్నామో కారణాలను వివరించింది. ఇది బీజేపీ రాజకీయ ప్రాజెక్టు అని.. మతం అనేది వ్యక్తిగత విషయమని తెలిపంది. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అయోధ్యలో రాజకీయ ప్రాజెక్టు సృష్టించాయని.. అయోధ్య రామాలయం ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదని.. అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభిస్తున్నారని.. ఇదంతా ఎన్నికల ప్రయోజనాల కోసమే చేస్తున్నారని ఆరోపించింది.


కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని కర్నాటక కాంగ్రెస్‌ సమర్థించింది. మనమంతా హిందువులమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాను హిందువునేనని.. రాముడి భక్తుడినేనన్నారు. హనుమంతుని భక్తుడినని.. తామంతా ఇక్కడి నుంచే ప్రార్థిస్తామని.. రాముడు మన హృదయాల్లోనే ఉన్నాడని.. రాజకీయం చేయడానికి ఏమీ లేదన్నారు.


కాంగ్రెస్‌ దుమ్మెత్తిపోసిన బీజేపీ..


కాంగ్రెస్ నిర్ణయం బీజేపీ దూకుడు పెంచింది. ఇన్నాళ్లూ రామ మందిరం కోసం కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా తీసుకోలేదని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు. రాముడి ఉనికిని కూడా కాంగ్రెస్ ఖండించిందని.. అయోధ్యకు వెళ్లేది లేదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసిందన్నారు. రాముడిని ఊహాజనితంగా పిలిచే వారికి ఇదేం కొత్త నిర్ణయం కాదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాముడిని ఆలయ ప్రారంభోత్సవాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌ను 2024లో ప్రజలు బహిష్కరిస్తారన్నారు.