ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వేశాఖ..!
ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో నెల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు

Special Trains | ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో నెల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా రైళ్లను పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు వివరించారు. విశాఖ-కర్నూల్, కర్నూల్-విశాఖపట్నం, భువనేశ్వర్ – తిరుపతి, తిరుపతి – భువనేశ్వర్ ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ-కర్నూల్ (08585) ప్రత్యేక రైలు జనవరి 16, 23, 30 అందుబాటులో ఉండనున్నది. ఆయా రైళ్లో సాయంత్రం 5.35గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.20గంటలకు కర్నూలుకు చేరుకుంటుంది. కర్నూల్-విశాఖపట్నం (08586) స్పెషల్ ట్రైన్ జనవరి 17, 24, 31 తేదీల్లో మధ్యాహ్నం 3.30గంటలకు కర్నూల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
రైలు ఇరుమార్గాల్లో గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, ఉందానగర్, కాచిగూడ, మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఇక భువనేశ్వర్-తిరుపతి(02809) ప్రత్యేక రైలు జనవరి 13, 20, 27 తేదీల్లో నడువనున్నది. ఆయా రోజుల్లో భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 1.30గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చేరుతుంది.
తిరుపతి-భువనేశ్వర్ (02810) స్పెషల్ ట్రైన్ జనవరి 14, 21, 28 నడువనున్నది. ఆయా రోజుల్లో రాత్రి 8.15గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. ఇరుమార్గాల్లో ఖుర్దారోడ్, బుల్గావ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వివరించారు.