వైసీపీకి శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు గుడ్‌బై

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. న‌ర‌స‌రావుపేట లోక్‌స‌భ స‌భ్యుడు, పార్టీ సీనియ‌ర్ నేత ఎల్ శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం వైసీపీకి గుడ్ చెప్పారు

వైసీపీకి శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు గుడ్‌బై
  • పార్టీకి, లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా



విధాత‌: ఏపీలో అధికార‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. న‌ర‌స‌రావుపేట లోక్‌స‌భ స‌భ్యుడు, పార్టీ సీనియ‌ర్ నేత ఎల్ శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం వైసీపీకి గుడ్ చెప్పారు. అలాగే లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. ‘అవును. నిజ‌మే నేను వైసీపీకి, లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాను’ అని శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు మీడియాకు వెల్ల‌డించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మారుస్తార‌ని వ‌స్తున్న వ‌దంతుల నేప‌థ్యంలో ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.


గ‌త కొన్ని నెల‌లుగా న‌ర‌స‌రావుపేట లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ స్థానం నుంచి శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లును పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ మారుస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. న‌ర‌స‌రావుపేట‌ స్థానాన్ని వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు పార్టీ నుంచే వైదొలిగిన‌ట్టు తెలుస్తున్న‌ది.


40 ఏండ్ల శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌ల‌ను మార్చాల‌ని గ‌త ఆరు నెల‌లుగా పార్టీ అంత‌ర్గ‌తంగా భావిస్తున్న‌ప్ప‌టికీ 15 రోజులుగానే ఈ వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ డ్రామాకు తెర దించాల‌నే ఉద్దేశంతోనే ఆయ‌న పార్టీకి గుడ్‌బై చెప్పిన‌ట్టు తెలుస్తున్న‌ది. రాజీనామాలో బాట‌లోనే మ‌రో ఇద్ద‌రు వైసీపీ నేతలు ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, తాను ఏ పార్టీలో చేర‌బోయేది, త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏమిట‌నేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు తెలిపారు.