ఓయూలో విద్యార్థినిల ఆందోళన

ఓయూ సికింద్రాబాద్ పీజీ లేడీస్ హాస్టల్లో తరుచూ ఆగంతకులు చొరబడుతున్నారని, తమకు రక్షణ లేదని, భద్రత చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు శనివారం నిరసనకు దిగారు.

ఓయూలో విద్యార్థినిల ఆందోళన
  • విద్యార్థినిల భద్రత గాల్లో దీపమైందని కవిత ట్వీట్‌

విధాత : ఓయూ సికింద్రాబాద్ పీజీ లేడీస్ హాస్టల్లో తరుచూ ఆగంతకులు చొరబడుతున్నారని, తమకు రక్షణ లేదని, భద్రత చర్యలు తీసుకోవాలని, సీసీ టీవీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని విద్యార్థినిలు శనివారం నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు తాము పట్టుకున్న అగంతకుడిని తీసుకెళ్లొద్దంటూ భీష్మించారు. అర్ధరాత్రి ఓయూ సికింద్రాబాద్‌ పీజీ లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఆగంతకులలో విద్యార్థినిలు ధైర్యంగా ఒకరిని పట్టుకుని చున్నీతో కట్టేసి బంధించారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు నిరసన వ్యక్తం చేయగా, అందుకు హామీ ఇచ్చిన పోలీసులు విద్యార్థినిలను శాంతింపచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపమంటూ కవిత ట్వీట్‌

కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదని చెప్పేందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శనని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మొన్న ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నాయని వార్తలు వచ్చినా ప్రభుత్వం మేల్కోలేదని, ఫలితంగా ఆగంతకులు రెచ్చిపోయి నిన్న సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారన్నారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని..వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నానని కవిత ట్వీట్ చేశారు.