క‌న్న‌బిడ్డ‌కు కాలేయ దానం.. విజ‌య‌వంత‌మైన లివ‌ర్ మార్పిడి

అతి త‌క్కువ బ‌రువుతో పుట్టాడు. బ‌రువు పెర‌గ‌డు.. నిద్ర పోడు... ఒంటి నిండా దుర‌ద‌లు.. ద‌ద్దుర్లు... ఆయాసం... ఆ బిడ్డ బాధ‌లు చూసి క‌న్న‌త‌ల్లి గుండె చెరువైపోయింది. తిర‌గ‌ని హాస్పిట‌ల్ లేదు

  • By: Somu    latest    Apr 21, 2024 11:49 AM IST
క‌న్న‌బిడ్డ‌కు కాలేయ దానం.. విజ‌య‌వంత‌మైన లివ‌ర్ మార్పిడి

విధాత‌ : అతి త‌క్కువ బ‌రువుతో పుట్టాడు. బ‌రువు పెర‌గ‌డు.. నిద్ర పోడు… ఒంటి నిండా దుర‌ద‌లు.. ద‌ద్దుర్లు… ఆయాసం… ఆ బిడ్డ బాధ‌లు చూసి క‌న్న‌త‌ల్లి గుండె చెరువైపోయింది. తిర‌గ‌ని హాస్పిట‌ల్ లేదు. ఇక మీ అబ్బాయి లేడ‌నే అనుకోండి.. అని చెప్పిన‌వాళ్లే.. అంద‌రూను. కానీ బాబు పుట్టిన 12 ఏళ్ల త‌ర్వాత త‌న కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి బ‌తికించుకుందా త‌ల్లి. ఇటీవ‌లే బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిట‌ల్ లో కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకుని, పున‌ర్జ‌న్మ పొందిన వ‌రుణ్ క‌థ ఇది.

అలిగ‌లె సిండ్రోమ్ అనే అరుదైన జ‌న్యు వ్యాధితో పుట్టాడు వ‌రుణ్‌. కాలేయంతో పాటు శ‌రీరంలో ఏ భాగాన్న‌యినా ప్ర‌భావితం చేసే ఈ జ‌న్యు వ్యాధి వ‌ల్ల వ‌రుణ్ లో ఎదుగుద‌ల కుంటుప‌డిపోయింది. శ‌రీర‌మంతా దుర‌ద‌ల వ‌ల్ల గోకీ, గోకీ మొస‌లి చ‌ర్మంలా అయిపోయింది. 12 ఏళ్లు వ‌చ్చినా ఆరేళ్ల వాడిలా క‌నిపిస్తాడు. చురుగ్గా ఆట‌లు ఆడ‌లేడు. తోటివాళ్ల వెక్కిరింపుల‌తో మాన‌సికంగా కుంగిపోయాడు. కానీ… అప్పుడు పేగు బంధంతో ప్రాణం పోసిన అమ్మ‌… ఇప్పుడు కాలేయ బంధంతో మ‌ళ్లీ ప్రాణం పోసింది. కేర్ హాస్పిట‌ల్ లోని డాక్ట‌ర్ న‌యీమ్ బృందం ఈ ఆప‌రేష‌న్ ని విజ‌య‌వంతం చేశారు.

అలిగ‌లె సిండ్రోమ్ అంటే…

ఇది ఒక ఆటోజోమ‌ల్ డామినెంట్‌ జ‌న్యు వ్యాధి. ల‌క్ష మందిలో అలిగ‌లె సిండ్రోమ్ క‌నిపిస్తుంది. మ‌న శ‌రీరంలోని జ‌న్యువుల్లో లోపం వ‌ల్ల వ‌చ్చే వ్యాధి. దీనివ‌ల్ల కాలేయ నిర్మాణంలో లోపం ఉంటుంది. బైల్ డ‌క్ట్స్ (పిత్త నాళాలు) స‌క్ర‌మంగా ఏర్ప‌డ‌వు. ఫ‌లితంగా బైల్ జ్యూస్ (పిత్త‌ర‌సం) కాలేయంలోనూ, ర‌క్తంలోనూ చేరుతుంది. అందువ‌ల్ల దుర‌ద‌లు, కామెర్ల వంటి ల‌క్ష‌ణాలు బాధిస్తాయి. చివ‌రికి ఇది లివ‌ర్ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. సాధార‌ణంగా మేన‌రిక‌పు సంబంధాలు చేసుకున్న వాళ్ల పిల్ల‌ల‌కు ఇలాంటి జ‌న్యువ్యాధులు వ‌స్తుంటాయి. కానీ మేన‌రికం కాక‌పోయినా త‌ల్లిదండ్రుల్లో లోపం ఉన్న జ‌న్యువులు ఉంటే పిల్ల‌ల‌కు ఈ వ్యాధి వ‌చ్చేందుకు ఆస్కారం ఉంటుంది. వ‌రుణ్ త‌ల్లిదండ్రుల‌ది మేన‌రికం కాదు. అలిగ‌లె సిండ్రోమ్ వ‌ల్ల కాలేయం మాత్ర‌మే కాకుండా… గుండె, ఊపిరితిత్తులు, క‌ళ్లు, వెన్నుపాము, కిడ్నీల వంటి అవ‌య‌వాలు కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. చాలా సంద‌ర్భాల్లో ఈ జ‌బ్బు ఉన్న‌వాళ్ల‌కు ప్రాణాపాయం ఎక్కువ‌. ఎక్కువ రోజులు బ‌త‌క‌రు.

బ‌త‌క‌డ‌నుకున్న బాబు..

వ‌రుణ్ స‌మ‌స్య‌ను మొద‌ట బిలియ‌రీ అట్రీషియా అనే వ్యాధిగా పొర‌బ‌డ్డారు. దాంతో కొంత కాలం స‌రైన చికిత్స అందుకోలేక‌పోయాడు. కానీ వ‌రుణ్ కి 8 ఏళ్లు వ‌చ్చిన త‌రువాత ఇది అలిగ‌లె సిండ్రోమ్ గా నిర్ధార‌ణ అయింది. ప్ర‌తిరోజూ నిద్ర పోకుండా బాబు ప‌డుతున్న అవ‌స్థ చూస్తుంటే ఏమీ చేయ‌లేని అస‌హాయ‌త‌తో ఆ త‌ల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం. కేర్ హాస్పిట‌ల్ కి వ‌చ్చిన త‌ర్వాత లివ‌ర్ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ న‌యీమ్ ఇచ్చిన భ‌రోసాతో జీవితంపై ఆశ క‌లిగింద‌ని చెప్తారు వ‌రుణ్ త‌ల్లి అరుణ రాణి. ఆయుర్వేద వైద్యులైన ఆమె ఇప్పుడు చ‌లాకీగా తిరుగుతున్న బాబును చూసి, “నేను బాబుకు జ‌న్మ‌ను ఇచ్చాను. కానీ డాక్ట‌ర్ న‌యీమ్ మ‌ళ్లీ ప్రాణం పోసి, పున‌ర్జ‌న్మ‌నిచ్చార‌”ని చెప్తారు మెరుస్తున్న క‌ళ్ల‌తో.

విలేకర్ల సమావేశం సందర్బంగా, కేర్‌ హాస్పిటల్స్‌కు చెందిన లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మహ్మద్‌ నయీమ్‌ మాట్లాడుతూ, “వరుణ్ ప‌ల్మ‌న‌రీ ఆర్ట‌రీ (పుపుస ధ‌మని)లో అడ్డంకి తొల‌గించ‌డానికి మొదట్లో హార్ట్-స్టెంటింగ్ ప్రక్రియ కూడా జరిగింది. ఆ త‌రువాత ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో వ‌రుణ్ త‌ల్లిదండ్రులు ఇక్క‌డికి తీసుకొచ్చారు. కేర్ హాస్పిటల్స్ కాలేయ వైద్య బృందం శ్రీ వరుణ్ ఆరోగ్యం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వరుణ్ కాలేయం, గుండెతో సహా మిగ‌తా అవ‌య‌వాల‌ను కూడా ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన రుగ్మత అలగిలే సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు నిర్దారించాం. అటు కాలేయం ఫెయిల‌వ‌డం, ఇటు పల్మనరీ ఆర్టరీ స్టెనోసిస్ ల‌తో అత్య‌వ‌స‌రంగా లివ‌ర్ ట్రాన్స్ ప్లాంట్ చేశాం” అని చెప్పారు. త‌న బిడ్డ కోసం త‌న కాలేయాన్ని దానం చేయ‌డానికి ముందుకొచ్చిన వ‌రుణ్ త‌ల్లి అరుణ రాణిని ఆయ‌న అభినందించారు.