Sudha Murty | ఇన్ఫోసిస్‌లో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి షేర్ల విలువ ఎంతో తెలుసా..?

Sudha Murty | ఇన్ఫోసిస్‌లో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి షేర్ల విలువ ఎంతో తెలుసా..?

Sudha Murty: ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో 0.83 శాతం వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేర్‌ వాల్యూ రూ.1,616.95 ప్రకారం సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉంటుంది. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సతీమణి అయిన సుధామూర్తి దాతృత్వంలోనూ ముందుంటారు. మూర్తి ట్రస్ట్‌కు ఆమె ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

సుధామూర్తి పలు పుస్తకాలు కూడా రాశారు. అయితే ఇన్ఫోసిస్‌లో ఆమె భర్త నారాయణ మూర్తి షేర్ల విలువ కంటే సుధామూర్తి షేర్ల విలువ రెండింతల కంటే ఎక్కువే. ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తికి 1.66 కోట్ల షేర్లు మాత్రమే ఉన్నాయి. వాటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు ఉంటుంది. కాగా, సుధామూర్తికి 2006లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్‌ పురస్కారం లభించింది.

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ భార్య అక్షతామూర్తి.. నారాయణమూర్తి, సుధామూర్తిల కుమార్తె. కాగా, ‘సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు స్ఫూర్తివంతం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్‌ (X) లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కూడా ఎక్స్‌ వేదికగా.. ‘నాకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ బదులిచ్చారు.