Summer Heat | మండే ఎండలు.. ఆర్థిక వ్యవస్థకే కాదు.. రాజకీయ నాయకులకూ కష్టమే
Summer Heat | రాబోయే రోజుల్లో ఉగ్రరూపంలో ఉష్ణోగ్రతలు హెచ్చరిస్తున్న భారత వాతావరణ విభాగం కార్మికుల ఉపాధి, వ్యవసాయంరంగంపై దెబ్బ 2024 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఎండలు మండిపోతుంటే బయటకు అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించలేరు. సహజంగానే ఇది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది ఆర్థికవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నది. కానీ.. రాజకీయ నాయకులు కూడా ఎండలంటే భయపడుతున్నారు. ఎండలో ప్రజల మధ్య తిరగడానికి ఇబ్బంది పడతామని కాదు! […]

Summer Heat |
- రాబోయే రోజుల్లో ఉగ్రరూపంలో ఉష్ణోగ్రతలు
- హెచ్చరిస్తున్న భారత వాతావరణ విభాగం
- కార్మికుల ఉపాధి, వ్యవసాయంరంగంపై దెబ్బ
- 2024 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం
ఎండలు మండిపోతుంటే బయటకు అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించలేరు. సహజంగానే ఇది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది ఆర్థికవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నది. కానీ.. రాజకీయ నాయకులు కూడా ఎండలంటే భయపడుతున్నారు. ఎండలో ప్రజల మధ్య తిరగడానికి ఇబ్బంది పడతామని కాదు!
విధాత : భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఎండలు (Summer Heat) విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది ఎండాకాలం మామూలు కంటే కొంత ఎక్కువే కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ విభాగం హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజులు ఇంకా మండిపోయే అవకాశాలూ మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదే ఇప్పుడు రాజకీయ నాయకులను కలవరపెడుతున్నది. రాబోయే 2024 ఎన్నికలను ఈ పరిస్థితులు ప్రభావితం చేస్తాయన్నది వారి భయం. ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉన్నదన్నది ప్రధాన అంశంగా మారుతుంది. ఎక్కువకాలం వేసవి కొనసాగిన పక్షంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేసే కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అది ఓటరును మనసు మార్చుకునేలా ప్రమాదం లేకపోలేదు.
పెరుగుతున్న వేడి
గత కొన్నేళ్లుగా దేశంలో వేసవితాపం నానాటికీ పెరిగిపోతున్నది. గత ఏడాది పరిస్థితినే తీసుకుంటే.. సరిగ్గా పదేళ్లకు ముందు.. అంటే 2012లో హీట్‌వేవ్స్ రోజులతో పోల్చితే 2022లో రెట్టింపు ఉన్నాయి. అవి ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి.
కార్మికుల కొరత
2021లో తీవ్ర ఎండ సేవలు, ఉత్పాదకత, వ్యవసాయ రంగాలపై చూపిన ప్రభావంతో భారతదేశం 159 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందని 2022లో విడుదలైన ఒక నివేదిక అంచనా వేసింది. కేవలం వేసవితాపం కారణంగా నష్టపోయే కార్మికుల పనిగంటలతో భారతదేశం 2030 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు సంకేతాలు ఇచ్చింది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో 40 శాతం వరకు ఎండన పడి చేసే పనుల ద్వారానే ఉంటుందని అంచనా. ఇది వేసవి తాపం కార్మికుల ఉత్పాదకతపై చూపే ప్రభావం మాత్రమే.
వ్యవసాయం పైనా దెబ్బ
పెరిగే ఉష్ణోగ్రతలు అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఫలితంగా తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగే ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు జీడీపీలో 14 శాతం అందిస్తున్నాయి. ఇది దేశ వృద్ధి సమతుల్యతను కాపాడుతున్నది. దేశంలో సగం జనాభాకు ఈ రంగమే జీవనాధారం. మితిమీరిన ఎండలతో పాడిపరిశ్రమ కూడా దెబ్బతింటుంది. కనీసం 15 శాతం ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారి తీస్తాయి. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడానికి ప్రభుత్వానికి అనేక నెలలు పడుతుంది. ఈ ఏడాది సుదీర్ఘకాలం వేసవి రోజులు ఉంటాయని వాతావరణ విభాగం వేస్తున్న అంచనా నిజమే అయితే.. పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతుంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. దేశంలో సుదీర్ఘ వేసవికాల పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వాలపై ఒత్తిడి
ఇప్పటికే ఆహార ధాన్యాల సరఫరా కుదించుకుపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు మద్దతుగా నిలవాల్సిన ఒత్తిడికి ప్రభుత్వాలు గురవుతాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో వంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఆహార పదార్థాల సరఫరాతోపాటు.. ద్రవ్య విధానపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ నొక్కి చెప్పారు.
అనేక ఖర్చులు
సుదీర్ఘ వేసవి కొనసాగినట్టయితే కరెంటు వాడకం పెరుగుతుంది. ప్రభుత్వాలు డిమాండ్ మేరకు సరఫరా చేసేందుకు బయట నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలి. ఇది నేరుగా ఖజానాపై ప్రభావం చూపుతుంది. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు కరెంటు ఖర్చు తోడవుతుంది. ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. ఇవేకాదు.. అనేక ఇబ్బందులు ఉంటాయి.
అన్నీ ఓటరుపై ప్రభావం చూపేవే
ఓటరు నాడి పట్టుకోవడం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా అన్ని సమయాల్లోనూ సాధ్యం కాదు. ఓటరు కొద్దికాలం క్రితం కష్టాన్ని ఎదుర్కొన్నా.. దానికి కారణం ఎవరో వారు మూల్యం చెల్లించుకునేలా చేస్తాడు. ఇప్పడు రాజకీయ పార్టీలను ఇదే ఇబ్బంది పెడుతున్నది. అందుకే ఈ ఏడాది వేసవికాలం సజావుగా సాగిపోవాలని, సుదీర్ఘకాలం కొనసాగుతుందన్న ఐఎండీ అంచనాలు తప్పు కావాలని రాజకీయ నాయకులు కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?