Google Layoff | గూగుల్‌లో లే ఆఫ్స్‌పై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..?
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇందులో టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఉన్నది

Google Layoff | ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇందులో టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఉన్నది. 2022లో కంపెనీ సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను బయటకు పంపింది. అయితే, ఈ లే ఆఫ్స్‌పై కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించాయి. అది కఠిన నిర్ణయమన్న ఆయన.. సంస్థ భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకోక తప్పలేదదన్నారు. గూగుల్ గత సంవత్సరం 12వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. 25 సంవత్సరాల కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద లే ఆఫ్స్ కావడం విశేషం. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 6శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించడం సంచలనంగా నిలిచింది. 2022-2023లో చాలా టెక్ దిగ్గజ కంపెనీలతో పాటు ఈ కామర్స్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల గూగుల్ సంస్థలో ఆల్ హ్యాండ్స్ మీటింగ్ జరిగింది.
ఇందులో లే ఆఫ్స్‌పై కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్‌ని ఉద్యోగులు ప్రశ్నించారు. కఠిన నిర్ణయమైందని.. తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనంటూ సమర్థించుకున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలన్న కఠిన నిర్ణయం తీసుకుని సంవత్సరం దాటిందని.. ఆ నిర్ణయం సంస్థ లాభానష్టాలను, వృద్ధిని, ఆత్మస్థయిర్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందని మరో ఉద్యోగి ప్రశ్నించగా.. ఉద్యోగుల ఆత్మస్థయిర్యం ఆ నిర్ణయంపై ప్రభావమే చూపిందన్నారు. గూగుల్‌లో గత 25ఏళ్లలో అలాంటి పరిస్థితి లేదన్నారు. అప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించకపోతే, మరింత కఠినమైన నిర్ణయం ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చేదంటూ సమాధానం ఇచ్చారు. అయితే, ఆ నిర్ణయాన్ని అమలు చేసిన తీరు సరిగ్గా లేదని అంగీకరించారు. ‘టైమ్ జోన్‌కు సంబంధం లేకుండా.. ఒకే సమయంలో ఆ ఉద్యోగులందరినీ తొలగించి, వారికి వెంటనే యాక్సెస్‌ను కట్ చేయడం సరైన పద్ధతి కాదన్న ఆయన.. సరైన పద్ధతిలో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుండేదన్నారు.