సర్వేల్ గురుకులం నా జీవితాన్నే మార్చేసింది: DGP మహేందర్ రెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: సర్వేల్ గురుకుల పాఠశాల నా జీవితాన్ని మార్చి వేసిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో మంగళవారం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు షీ టీమ్స్ ఆధ్వర్యంలో 46 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించారు. వారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్టిఫికెట్లను, కుట్టు […]

సర్వేల్ గురుకులం నా జీవితాన్నే మార్చేసింది: DGP మహేందర్ రెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: సర్వేల్ గురుకుల పాఠశాల నా జీవితాన్ని మార్చి వేసిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో మంగళవారం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

అంతకుముందు షీ టీమ్స్ ఆధ్వర్యంలో 46 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించారు. వారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్టిఫికెట్లను, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకుల పాఠశాల లో చదివిన వారంతా జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారని తెలిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులంతా దేశ విదేశాలలోనూ ఉన్నత స్థానానికి ఎదిగారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, సాఫ్ట్ వేరు ఉద్యోగులుగా స్థిరపడ్డారని కొనియాడారు. ఇక్కడి విద్యార్థులంతా అనేక మందికి సమాజంలో ప్రేరణ కలిగించే శక్తిని కలిగి ఉన్నారని తెలిపారు. తాను కూడా సర్వేలు గురుకులంలో చదవకపోయి ఉంటే తన సొంత గ్రామంలో నా స్నేహితులతో పాటు వ్యవసాయం కానీ మరేదైనా పని చేసుకుంటూ జీవించి ఉండేవాడినేమోనని తెలిపారు.

అందుకే ఇక్కడ సీట్లు సాధించి చదువుతున్న విద్యార్థులంతా ఒక శక్తివంతులుగా మారి సమాజంలో గుర్తింపు పొందే విధంగా ఎదగాలని సూచించారు. చదువుతోపాటు మంచి నైపుణ్యం సంపాదించాలని తల్లిదండ్రులు గురువులకు పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. తాను ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్నానని ఈ సమయంలో పాఠశాలను సందర్శించాలని అనుకున్నట్టు తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకున్నందుకే నేను ఈ స్థాయికి చేరుకున్నానని విద్యార్థులకు వివరించారు. సరియైన పద్ధతిలో కృషి చేస్తే సాధించలేనిది ఏది ఉండదని తెలిపారు.

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కుట్టు శిక్షణ పొందిన మహిళలంతా సొంత కాళ్లపై ఉపాధిని పొందుతూ కుటుంబాలను ఆర్థికంగా కాపాడుకోవాలని కోరారు. విద్యార్థులు డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని చదువుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, భువనగిరి డిసిపి నారాయణరెడ్డి, చౌటుప్పల్ ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, సీఐ మహేష్, ఎస్సై యుగంధర్ గౌడ్, జడ్పిటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, సర్వే గ్రామ సర్పంచ్ కట్టెల భిక్షపతి, ఎంపీటీసీ ఈసం యాదయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.