అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అంజనీకుమార్ ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎత్తివేసింది.

- తాజాగా భారత ఎన్నికల సంఘం నిర్ణయం
- ఎంసీసీ ఉల్లంఘించారనే ఆరోపణలతో
- నాటి డీజీపీపై ఈసీఐ సస్పెన్షన్ వేటు
విధాత: తెలంగాణ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అంజనీకుమార్ ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎత్తివేసింది. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితో సమావేశమై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించారనే ఆరోపణలపై నాటి డీజీపీ అయిన అంజనీకుమార్‌పై ఈసీఐ సస్పెన్షన్ వేటు వేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని అంజనీకుమార్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన ఈసీఐ ఆయనపై వేసిన సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నది.
ఈ నెల మూడో తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, కొన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని నాటి డీజీపీ అంజనీకుమార్ కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర పోలీసు అధికారులు సంజయ్ కుమార్ జైన్, మహేష్ భగవత్ ఉన్నారు. వీరి ఫొటోలు చానెళ్లలో, సోషల్ మీడియాలో రావడంతో ఈసీఐ తీవ్రంగా పరిగణించింది. డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీఐ, మిగతా ఇద్దరు పోలీసు అధికారులకు నోటీసులు జారీచేసింది. అంజనీకుమార్ సస్పెన్షన్ తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తాకు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.