తెలంగాణ పోరాటాలన్నీ భూమికోసమే!
గత పదేళ్ల బీఆరెస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి సమస్యలు పరిష్కరించలేదని, రెవెన్యూ శాఖ సిబ్బందిని ఒక దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

- మన గడ్డది మహత్తర భూమి చరిత్ర
- చెరబట్టిన వాళ్లను తరిమి కొట్టారు
- ధరణితో భూముల్ని కొల్లగొట్టిన బీఆరెస్
- మహమ్మారి స్థానంలో భూ భారతి తెచ్చాం
- సర్కార్‌కు, పేదలకు వారధులు జీపీవోలు
- వాళ్ల దోపిడీకి మిమ్ము నాడు బలిచేశారు
- ఆ మచ్చ చెరిపేసేలా పనిచేయండి
- పేదలకు సహాయం కోసమే మీరు
- కొత్తగా నియమితులైన జీపీవోలకు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విధాత): గత పదేళ్ల బీఆరెస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి సమస్యలు పరిష్కరించలేదని, రెవెన్యూ శాఖ సిబ్బందిని ఒక దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన గ్రామ పాలనా అధికారులకు (జీపీవోలు) నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసం జరిగినవేనని అన్నారు. కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి వాళ్లు భూమి కోసమే పోరాడారని చెప్పారు. భూమి కోసం పోరాటాలే కాదు భూదాన్ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ ప్రాంతంలోనేనని అన్నారు. వెదిరె రామచంద్రా రెడ్డి వేల ఎకరాలు పేదలకు పంచి భూదానోద్యమం చేశారని గుర్తు చేశారు. ఆనాడు పీవీ నర్సింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచారని తెలిపారు. ఇంతటి మహత్తర చరిత్ర తెలంగాణకు ఉందన్న రేవంత్‌రెడ్డి.. భూమిని చెరపట్టినవారిని ప్రజలు దిగంతాలకు తరిమారిమారని గుర్తు చేశారు.
ధరణితో భూములు కొల్లగొట్టారు
గత ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములను కొల్లగొట్టాలని చూశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ దోపిడీకి వీఆర్వోలు, వీఆర్‌ఏలు అడ్డుగా ఉన్నారని వారినే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని దోపిడీదారులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ధరణి తెచ్చిన సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, సిరిసిల్లలో అధికారులపై తాళి బొట్టు విసిరిన పరిస్థితి చూశామని చెప్పారు. ఈ ఇబ్బందులు అధికారుల వల్ల జరుగలేదని, నాటి పాలకులు సృష్టించిన వైరస్ ఫలితం ఇదని అన్నారు.
ధరణి మహమ్మారిని వదిలించాం
‘ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఆనాడు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూ భారతి చట్టం తీసుకొచ్చాం. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో పరిష్కరించే ప్రయత్నం చేశాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులు ప్రభుత్వానికి పేద ప్రజలకు వారధులుగా నిలవాలని కోరారు. ‘పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని తిరిగి నియమించాం’ అని చెప్పారు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఎవరో కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా? అని సీఎం ప్రశ్నించారు. వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందన్న రేవంత్.. మరి వాళ్ళనేం చేయాలని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి మంచిపేరు తెండి
తెలంగాణ సాధనలో, ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన మీరు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని కోరారు. భూ భారతి చట్టాలను అమలు చేయడమే కాదు.. సాదా బైనామాల సమస్య పరిష్కరించాలని చెప్పారు. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అన్నారు. గత పాలకులు మిమ్మల్ని తెలంగాణా సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని, గతంలో మీమీద పడిన మచ్చను చెరిపివేసేందుకు అవకాశం వచ్చిందని గ్రామపరిపాలన అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఆ ముద్రను చెరిపేసుకుని, ఆనాటి పాలకుల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. మీపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించూకునేలా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, కొత్తగా నియామక పత్రాలు అందుకున్న గ్రామ పరిపాలన అధికారులు పాల్గొన్నారు.