కాంగ్రెస్ టార్గెట్ 10-14 సీట్లు
పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. 14 స్థానాల్లో గెలువాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతున్నది

మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం
పట్టు నిలుపుకొనేలా వ్యూహాలకు పదును
ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్
ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లినుంచి శంఖారావం
అక్కడి నుంచి వరుసగా సీఎం పర్యటనలు
ఆపరేషన్ ఆకర్ష్‌పై జోరుగా ఊహాగానాలు
విధాత: పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. 14 స్థానాల్లో గెలువాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతున్నది. ఎన్నికల ప్రచారాన్ని కూడా వెంటనే మొదలు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఇంద్రవెల్లిలో 2వ తేదీన భారీ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రవెల్లి అమర వీరుల కుటుంబాలను రేవంత్ కలిసి మాట్లాడటానికి స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా వారంలో రెండు మూడు రోజులు జిల్లాల పర్యటన చేయాలన్న నిర్ణయానికి రేవంత్ వచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభ పెట్టాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా 60 రోజులు మాత్రమే సమయం ఉందని, నాయకులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో ఉండాలని ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం కేడర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఇంచార్జ్‌లను నియమించింది.
10-14 స్థానాల గెలుపే టార్గెట్
రాష్ట్రంలో ఉన్న17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్నది. ఈ మేరకు ఆ పార్టీ అంతర్గత సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం. అలాగే పార్లమెంటుకు గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు పార్టీ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో స్పష్టమైన మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు పార్టీ అంచనా వేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా గెలిచే విధంగా పనిచేయాలని నిర్ణయించింది. గట్టిగా పనిచేస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న పార్లమెంటు స్థానాలు కూడా కైవసం చేసుకోవచ్చుని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, చేవెళ్ల, కరీంనగర్, జహీరాబాద్‌లలో గెలుస్తామన్న ధీమాతో కాంగ్రెస్ ఉన్నది. ఈ మేరకు ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం స్పష్టమైందని తెలిసింది. ఇవేకాకుండా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలలో ఒక రెండింటిని ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన మెదక్‌తోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్‌పై కేంద్రీకరించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.
కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న ధీమా రావడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా పెరుగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి అనేకమంది పోటీ పడుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే బీఆరెస్, బీజేపీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. కాగా మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి (అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్) సంగీతారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిన కలువడం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది.