Gaddar | గొంతుక లేని వారి గొంతుకగా గద్దర్.. ఆయన విప్లవ ప్రస్థానమిదీ..
Gaddar | సమాజంలోని అన్ని వర్గాలను మేలుకొలిపేది పాటనే. ఆ పాటనే సామన్యులకు పైతం అర్థమయ్యేలా చెప్పి.. చైతన్యవంతులను చేసేది ప్రజాగాయకులే. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వస్తారు. ఆ మాదిరిగానే గద్దర్ ప్రజా యుద్ధ నౌకగా మారారు. మెదక్ జిల్లాలోని గజ్వేల్ తాలుకా తుఫ్రాన్‌లో జన్మించారు. నాన్న గుమ్మడి శేషయ్య మేస్త్రీ, తల్లి లచ్చమ్మ. గద్దర్‌కు ఒక అన్నయ్య, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. గూన పెంకుటిల్లో నివాసం ఉండేవారు. నాన్న వృత్తిరీత్యా మేస్త్రీ కావడంతో పలు ప్రాంతాల్లో […]

Gaddar |
సమాజంలోని అన్ని వర్గాలను మేలుకొలిపేది పాటనే. ఆ పాటనే సామన్యులకు పైతం అర్థమయ్యేలా చెప్పి.. చైతన్యవంతులను చేసేది ప్రజాగాయకులే. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వస్తారు. ఆ మాదిరిగానే గద్దర్ ప్రజా యుద్ధ నౌకగా మారారు. మెదక్ జిల్లాలోని గజ్వేల్ తాలుకా తుఫ్రాన్‌లో జన్మించారు. నాన్న గుమ్మడి శేషయ్య మేస్త్రీ, తల్లి లచ్చమ్మ. గద్దర్‌కు ఒక అన్నయ్య, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
గూన పెంకుటిల్లో నివాసం ఉండేవారు. నాన్న వృత్తిరీత్యా మేస్త్రీ కావడంతో పలు ప్రాంతాల్లో పనికి వెళ్లేవారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా పని చేసేవారు శేషయ్య. అంతేకాదు అంబేద్కర్‌ను దగ్గర నుంచి చూశారు శేషయ్య. ఔరంగాబాద్ అంబేద్కర్ నిర్మించిన మిలింద్ విద్యాలయానికి మా నాన్న మేస్త్రీగా పని చేశారు.
అంబేద్కర్ ప్రభావం శేషయ్యపై బాగా పడింది. దీంతో తినడానికి తిండి లేకపోయినా.. బిడ్డల్ని స్కూల్‌పే పంపేవారని గద్దర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో పిల్లలందరికీ సరస్వతీ భాయ్, భారతి భాయ్, నరసింగరావు అని పేర్లు పెట్టారు. నాకు విఠల్ రావు అని పెట్టారు. కూలి పని చేసే నాన్నకు సంతకం పెట్టేందుకు రాకపోయేది. అయినా హిందీ, మరాఠీ, ఉర్దూ అన్ని భాషలు మాట్లాడేవారు. ఏడాదిలో నెల రోజుల కంటే ఎక్కువ రోజులు ఊళ్లో ఉండేవారు.
ఇంజినీరింగ్ చదువుతుండగానే ఉద్యమంలోకి..
ఊళ్లోనే ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాత హాస్టళ్లో ఉండి ఎస్ఎస్ఎల్‌సీ పూర్తి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండగానే ఉద్యమంలో చేరాను. దాంతో ఊరు వదిలిపెట్టి, ఉద్యమం పేరుతో కొన్ని వందల ఊర్లు తిరిగాను. అడవుల్లో బతికాను. అలా గుమ్మడి విఠల్ రావు గద్దర్‌గా మారిపోయాడు. నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడు అమ్మను చూడడానికి అప్పుడప్పుడు మారువేషంలో ఊరికి వెళ్లి వస్తుండేవాడిని. అమ్మ చనిపోయినప్పుడు నా చిన్నకొడుకు చనిపోయినప్పుడు ఊరు వెళ్లాను కానీ, అక్కడ ఉండలేదు. కొన్నాళ్ల తర్వాత అల్వాల్‌లో ఇల్లు కట్టుకున్నానని గద్దర్ చెప్పుకొచ్చారు.
గద్ధర్ అంటే విప్లవం..
నా పేరు గద్దర్‌గా మార్చుకోవడానికి కారణం విప్లవం. విప్లవంలో పాల్గొన్న సమయంలో అసలు పేరు ఉండకూడదు. వేరే పేరు ఉండాలి. పంజాబ్ నుంచి వెళ్లిన చాలా మంది జాతీయవాదులు అమెరికా – కెనడాలో గద్దర్ పార్టీ అని పెట్టారు. ఇండియాలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు అక్కడి నుంచి పోరాటం చేసేవారు. గద్దర్ అంటే పంజాబిలో విప్లవం అని అర్థః. అలా నా పేరును గద్దర్‌గా మార్చుకున్నా. ఆ పేరుతోనే ప్రజలను చైతన్యం చేసేలా పాటలు రాశాను అని తెలిపారు గద్దర్.
అదే నా తొలి పాట..
సందర్భం ఏదైనా సరే పాలకులను ప్రశ్నించేలా ప్రజలను చైతన్యం చేసేలా ప్రజా కవులు పాటలు రాస్తుంటారు. వాళ్లు ఎప్పుడూ అండర్ గ్రౌండ్‌లోనే ఉంటారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూనే ఉంటారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నేను మొదటిసారి పాట రాశాను. రిక్షా తొక్కే రహీమన్నా.. రాళ్లు కొట్టే రామన్నా.. ఇదే నా తొలిపాట అని చెప్పారు.
జెండా వెనుక కథ ఇదీ..
నేను ఎక్కడా పోయినా నా వెంట ఓ కర్ర ఉంటుంది. నా కర్రకు బుద్ధుడి జెండా ఉంటుంది. అది మా నాన్నది. ఇంజినీరింగ్ కాలేజీకి వచ్చాక ఎర్రజెండా చేరింది. పులేకి గుర్తుగా నీలం రంగు జెండాను కట్టాను.
అప్పుడు పోలీసులు పట్టుకున్నారు..
ఇంజినీరింగ్ వదిలిపెట్టి బ్యాంకు సర్వీస్ రాసి మామిడిపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పోలీసులు నన్ను పట్టుకున్నారు. కొన్ని రోజుల పాటు టార్చర్ సెల్‌లో పెట్టారు. రెండు రోజులు ఫ్యాన్‌కు వేలాడదీసి కొట్టారు. సమాచారం తెలుసుకుని, నన్ను బంధించిన చోటుకు మా అమ్మ వచ్చి గొడవ చేశారు. అజ్ఞాతవాస జీవితం అది. అప్పుడు కుటుంబం చెల్లా చెదురైంది. నా భార్య డెలివరీకి నేను జైల్లో ఉన్నాను. డెలివరీ ఖర్చులకు చేతిలో డబ్బులు కూడా లేవు అని తెలిపారు.
వెన్నులో బుల్లెట్ ఉన్నా.. పల్లెపల్లెకు పాటను తీసుకెళ్లారు..
1997లో గద్దర్‌పై దాడి జరిగింది. వెన్నులో బుల్లెట్ బాధపెడుతున్నా అణగారిన గొంతుకల కోసం పాటను పల్లెపల్లెకు తీసుకెళ్లారు. తూటాలు దిగినా ఆయన వెనుకంజ వేయలేదు. తుదిశ్వాస వరకు.. గొంతులేని వారి కోసం గొంతుకగా మారారు. గళమెత్తారు.. ఆడారు.. పాడారు. చివరకు ఐసీయూలో కూడా పాటలు ఆలపించి అనంతలోకాలకు వెళ్లిపోయారు గద్దర్.