ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా రాష్ట్రం చిహ్నం

ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిబింబించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కనబర్చేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా రాష్ట్రం చిహ్నం
  • ప్ర‌జాస్వామ్య ఆన‌వాళ్లు ప్ర‌స్పుటించేలా రాష్ట్రం చిహ్నం
  • అందేశ్రీ‌తో చ‌ర్చించి కాలానుగుణంగా తెలంగాణ గీతంపై మార్పులు
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

విధాత‌: ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిబింబించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కనబర్చేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన స‌భ్యులుగా మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీత‌క్క్, కొండా సురేఖ‌లు ఉన్న మంత్రివర్గ ఉపసంఘం స‌మావేశ‌మైంది. ప్రజాస్వామ్య అనావాళ్లును ప్రస్పుటించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని భ‌ట్టి తెలిపారు. తెలంగాణ విగ్రహం రాష్ట్రంలోని సామాన్య మహిళను గౌరవించేలా ఉండాలని సూచించారు. రాష్ట్ర గేయానికి సంబంధించి ప్రముఖ కవి అందెశ్రీతో చర్చించి సమకాలీన కాలాన్ని అణుగుణంగా జయజయ హే పాటకు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ప్రముఖ కళాకారులు, మేధావులతో రాష్ట్ర చిహ్నం, విగ్రహానికి సంబంధించిన డిజైన్‌లను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతం, రాష్ట్ర విగ్రహంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చిహ్నంపై నాగార్జున సాగర్‌ డ్యామ్‌, ఇతర ముఖ్యమైన ఐకానిక్‌ చిత్రాలు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అణుగుణంగా ఏ వర్గం, మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్ర చిహ్నాన్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర గీతంలో అన్ని జిల్లాలకు చోటు కల్పించాలని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ విలువలను ప్రతిబింబించేలా తెలంగాణ మహిళ విగ్రహాన్ని రీడిజైన్ చేయాలని మంత్రి సీతక్క కోరారు. ఈ స‌మావేశంలో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావు, టూరిజం అండ్ కల్చర్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు, ప్రొటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.