సాదా బైనామాల క్రమబద్ధీకరణ.. ఎప్పటినుంచి అంటే..
పేద రైతుల ప్రయోజనం కోసం కాంగ్రెస్ సర్కారు మరో అడుగు ముందుకేయనుందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు.

- సాదాబైనామా క్రమబద్ధీకరణకు చట్ట సవరణ!
- లోక్‌సభ ఎన్నికల తరువాత ఫోకస్
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు
- రేవంత్‌రెడ్డి ప్రభుత్వ యోచన!
- పదిలక్షల మంది పేద రైతులకు ఊరట
విధాత: పేద రైతుల ప్రయోజనం కోసం కాంగ్రెస్ సర్కారు మరో అడుగు ముందుకేయనుందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికీ నోటి మాట ద్వారా, తెల్ల కాగితాల ద్వారా భూ లావాదేవీలు జరుగుతున్నాయి. పేద రైతులు పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ల భారం భరించలేక నోటిమాట మీదనే లావాదేవీలు నిర్వహిస్తుంటారు.
కానీ గత బీఆరెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో సాదాబైనామాల అంశాన్నిఎత్తి వేయడంతో లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ సమస్యను గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కారు సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలన్న యోచనలో ఉన్నట్లు విశ్వనీయంగా తెలుస్తోంది. సాదాబైనామా దరఖాస్తులను క్రమబద్ధీకరించాలన్న నిర్ణయం పేదల రైతులకు భారీ ఊరట కలుగుందని భూ చట్టాల నిపుణులు అంటున్నారు.
పది లక్షల మంది రైతులకు ప్రయోజనం!
కాంగ్రెస్ ప్రభుత్వం సాదాబైనామాలపై నిర్ణయం తీసుకుంటే దాదాపు 10 లక్షల పైచిలుకు పేద రైతులకు ప్రయోజనం కలుగనున్నది. ఈ దిశగా సర్కారు వేగంగా కసరత్తు చేస్తోంది. ధరణి చట్టం అమలులోకి వచ్చిన తరువాత సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకు లేకుండా పోయింది. కానీ గత ప్రభుత్వం సాదాబైనామా దరఖాస్తులు తీసుకోవడం గమనార్హం.
అలా వచ్చిన దరఖాస్తులు దాదాపు 7 లక్షల వరకు ఉన్నాయి. అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవి కాకుండా ధరణి చట్టం అమలులోకి వచ్చే నాటికి మరో 2.24 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ఇవన్నీ కలిపి 9.24 లక్షల దరఖాస్తులు కాగా వీటికి అదనంగా మరో లక్షల వరకు సాదాబైనామాలు జరిగే అవకాశం ఉందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు.
సాదాబైనామాల కోసం గతంలో జమాబందీ
తెలంగాణలో నోటి మాట ద్వారా, తెల్లకాగితాల ద్వారా జరిగే లావాదేవీలను తాసిల్దార్లు 1948 చట్టం ప్రకారం విచారించి పట్టా ఇచ్చేవారు. ఇందుకోసం ప్రతి ఏటా గ్రామాల్లో తాసిల్దార్లు జమాబందీ నిర్వహించే వారు. తాసిల్దార్ తన బృందంతో వెళ్లి గ్రామాల్లో విచారణ చేసి రికార్డ్‌లో కొనుగోలు దారు పేరు ఎక్కంచి, పట్టా ఇచ్చేవారు. జమాబందీ ద్వారా పేద రైతులకు నయాపైస ఖర్చులేకుండా భూమి పట్టా చేపి పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చేవారు.
కానీ 1971లో తీసుకు వచ్చిన ఆర్ఓఆర్ చట్టం ద్వారా జమాబందీలకు ఫుల్ స్టాఫ్ పడింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులతో 1989లో అప్పటి ప్రభుత్వం చట్టాన్ని అమెండ్‌మెంట్ చేసి సాదాబైనామాలు చేశారు. ఈ మేరకు 1989, 2000, 2014, 2020లలో సాదాబైనామాలు చేశారు. అయితే 2020లో తీసుకు వచ్చిన ధరణి చట్టంలో సాదాబైనామాలకు అవకాశం లేక పోవడంతో సాదాబైనామా దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.
దీంతో గ్రామీణ ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని గుర్తించిన సర్కారు ధరణి కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసి సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి అనుమతి ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ధరణి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ధృవీకరించారు.