ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట

అసలే అప్పుల భారంతో ఆర్థిక కష్టాలలో రోజులు వెళ్లదీస్తు..ఇచ్చిన హామీల అమలుకు అపసోపలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు రూపంలో భారీ ఊరట దొరికింది.

  • By: Somu    latest    Mar 08, 2024 10:41 AM IST
ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట
  • 50వేల కోట్ల విలువైన 850ఎకరాలు ప్రభుత్వ ఖాతాల్లోకి


విధాత : అసలే అప్పుల భారంతో ఆర్థిక కష్టాలలో రోజులు వెళ్లదీస్తు..ఇచ్చిన హామీల అమలుకు అపసోపలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు రూపంలో భారీ ఊరట దొరికింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయంతో ప్రైవేటు సంస్థల పాలు కావాల్సిన 50వేల కోట్ల విలువైన 850 ఎకరాల భూముల వివాదంలో హైకోరు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం సానుకూలంగా కనిపిస్తుంది.


18 ఏండ్ల సుదీర్ఘ విచారణ పిదప ఆ 850 ఎకరాలు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ భూములు తిరిగి ప్రభుత్వానికి దక్కడంతో వాటిలో హెచ్‌ఎండీఏ ద్వారా అభివృద్ధి చేసి ఆదాయ వనరుల సమీకరణ చేయడం, లేక వేలం చేపట్టడం, లేక ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించడం వంటి నిర్ణయాలకు ప్రభుత్వానికి వెసులుబాటు దక్కింది.


ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన వివాదం..18ఏళ్లకు కొలిక్కి


చంద్రబాబు ప్రభుత్వంలో హయాంలో 2003లో ‘ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేటు లిమిటెడ్(ఐఎంజీబీపీఎల్‌) కంపనికి ఆ కంపనీ ఏర్పాటైన నాలుగు రోజులకే ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించారు. అనంతరం అపద్దరమ్మ ప్రభుత్వంగా ఉన్న బాబు ప్రభుత్వం పూర్తి క్యాబినెట్ లేకుండానే ప్రభుత్వంపై ఎంవోయూపై సంతకాలు చేసింది. ఐఎంజీ బీపీఎల్‌ అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా దానికి అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు.


క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసుకుని, కంపనీ ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను బాబు ప్రభుత్వం ఆ కంపనీకి కేటాయించింది.


ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుండగా.. ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. ఆ భూముల కేటాయింపులను విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రద్దు చేస్తూ 2007లో వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది.


వీగిపోయిన ఐఎంజీబీపీఎల్ వాదన


ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి 2004 వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఎంజీబీపీఎల్‌కు కేటాయించిన భూములను 2007లో తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీబీపీఎల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది.


సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్పులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది. అలాగే అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఈ భూ కేటాయింపుల నిర్ణయాలపై సీబీఐ విచారణకు మీరు ఆదేశిస్తారా లేక మమ్మల్ని ఆదేశించమంటారా అంటూ వారం రోజుల గడువుతో కేసు విచారణ వాయిదా వేసింది.