ప్రశ్నపత్రాల లీకేజీ.. పార్టీలు… నిరుద్యోగులు! అసలు విషయం పక్కదారి?

అధికార, విపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ మైలేజీ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో నష్టపోతున్నది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. మొదట ఏఈ పేపర్‌ లీకేజీతో మొదలైన ఉదంతం తర్వాత అందరూ నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పేపర్‌ లీకేజీ నష్టపోతున్నది నిరుద్యోగులు. ఏండ్ల తరబడి కుటుంబాలకు వేలకు వేలు పెట్టి కోచింగులు తీసుకున్న వారి కలలన్నీ కల్లోలయ్యాయి. ఈ విషయంలో సర్వీస్‌ కమిషన్‌ అలసత్వమే నిరుద్యోగులను నిండా ముంచిందనే […]

  • By: krs    latest    Mar 24, 2023 8:51 AM IST
ప్రశ్నపత్రాల లీకేజీ.. పార్టీలు… నిరుద్యోగులు! అసలు విషయం పక్కదారి?
  • అధికార, విపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు
  • రాజకీయ మైలేజీ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో నష్టపోతున్నది నిరుద్యోగులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. మొదట ఏఈ పేపర్‌ లీకేజీతో మొదలైన ఉదంతం తర్వాత అందరూ నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పేపర్‌ లీకేజీ నష్టపోతున్నది నిరుద్యోగులు. ఏండ్ల తరబడి కుటుంబాలకు వేలకు వేలు పెట్టి కోచింగులు తీసుకున్న వారి కలలన్నీ కల్లోలయ్యాయి.

ఈ విషయంలో సర్వీస్‌ కమిషన్‌ అలసత్వమే నిరుద్యోగులను నిండా ముంచిందనే అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే రాత్రికి రాత్రే ఈ తతంగమంతా జరగలేదని.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి కొన్నేళ్లుగా ఇదే దందా చేస్తున్నారని ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం తెలుస్తున్నది.

పార్టీల ఎంట్రీతో.. విషయం పక్కదారి

పేపర్‌ లీకేజీ వ్యవహారంలోకి పార్టీలు ఎంట్రీ నిరుద్యోగులకు న్యాయం చేసిందా? నష్టం చేసిందా? అంటే నష్టమే చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ఏడాది కావడంతో సర్వీస్‌ కమిషన్‌ వైఫల్యం కంటే అధికారపార్టీపై ముఖ్యంగా కేసీఆర్‌, కవిత, కేటీఆర్‌లపైనే బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి వాళ్లు ఆరోపణలు చేయడంతో విషయం పక్కదారి పట్టినట్టు కనిపిస్తున్నది.

ఇందులో అధికార పార్టీ కూడా తక్కువేం తినలేదు. లీకేజీపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణ. 2018 నుంచి నాలుగేళ్లు నియామకాలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రస్తావిస్తే గత ప్రభుత్వాల హయాంలో కంటే తామే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాని దాట వేసే ప్రయత్నం చేశారు.

మొన్న ప్రెస్‌మీట్‌లోనూ మంత్రి కేటీఆర్ సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటివరకు ఇచ్చిన నోటీఫిషన్లు, నియామకాల భర్తీ, పారదర్శకత, ఇతర సర్వీస్‌ కమిషన్లకు టీఎస్‌పీఎస్సీ ఆదర్శనం అన్ని గొప్పలు చెప్పారు. కానీ నాలుగు పేపర్లు లీకేజీ అయి ఆ పరీక్షలు రద్దవడాన్ని దురదృష్టకరంగా అభివర్ణించి చేతులు దులుపుకున్నారు.

లీకేజీపై వారిపై వస్తున్న ఆరోపణలు మాకు ఏం సంబంధం అంటూనే.. సర్వీస్‌ కమిషన్‌ రాజ్యాంగబద్ధ సంస్థ అంటూనే… ఎక్కడ నిరుద్యోగులు తమకు దూరమౌతారోనని, తాము సచ్ఛీలురమని సర్టిఫికెట్‌ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అందుకే పొలిటికల్‌ పార్టీల ఎంట్రీతోనే ప్రశ్నపత్రాల వ్యవహారం పక్కదారి పట్టిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేతల అత్యుత్సాహం.. నిరుద్యోగులకు నష్టం

అలాగే విపక్ష నేతలు నిర్దిష్ట ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకి ఆయుధంగా మారుతున్నాయి. కేటీఆర్‌, కవితల పాత్ర ఇందులో ఉన్నదని.. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి సొంత మండలంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ లో 100 పైగా మంది అభ్యర్థులకు 100కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. వాళ్లంతా మెయిన్స్‌కు క్వాలీఫై అయ్యారని అన్నారు.

పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్‌ తరఫున వాదించిన ఏఐసీసీ లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఒకే మండలం నుంచి 20 మంది అధిక మార్కులు సాధించారు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టును కోరారు. సిట్‌పై తమకు నమ్మకం లేదనే వారి వాదన కరెక్టే అని చెప్పడానికి సరైన ఆధారాలు సమర్పించలేదు.

దీంతో దర్యాప్తు సక్రమంగా జరగట్లేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు పేర్కొనడం గమనార్హం. దీంతో బండి సంజయ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ లాంటి వాళ్లు కూడా సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్‌కు అర్థం లేకుండా పోతున్నది.

అంతేకాదు కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థలను విపక్షాలను వేధించడానికి వినయోగిస్తున్నదని కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్ష నేతలపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులన్నీ రాజకీయ కక్ష్య సాధింపులో భాగమే అనే బీఆర్‌ఎస్‌ వాదననే కేంద్రంలో కాంగ్రెస్‌ సహా ఇతర ఇతర పార్టీలు అంటున్నాయి.

ఏ విషయంలో అయినా జాతీయ పార్టీలకు ఒక విధానం ఉండాలని కేసీఆర్‌ అప్పుడప్పుడు అంటున్నది ఇందుకే. ఈ విషయంలో రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించకపోవడం, ముఖ్యమంత్రి శాఖలపై సరిగ్గా సమీక్షలు చేయకపోవడం, అన్ని శాఖల వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

అసెంబ్లీలో 80 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ప్రకటించి నెలలు గడిచాయి. ఇప్పటికీ నియామకాలు పూర్తవకపోగా మొత్తం ప్రక్రియనే మొదటికి వచ్చింది. ఈ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన విపక్ష నేతలు ఆధారాలు లేని ఆరోపణలతో అధికార పార్టీకి మేలు చేసేలా వ్యాఖ్యానిస్తున్నారు.

పేపర్‌ లీకేజీ విషయంలో విపక్ష నేతలంతా నిరుద్యోగుల అండగా ఐక్యంగా ఏకతాటి పైకి వచ్చి కొంత అధ్యయనం చేసి సరైన ఆధారాలు సేకరించి ఆరోపణలు చేసి ఉంటే ఇవాళ అధికారపార్టీకి మాట్లాడే అవకాశం ఉండకపోయేదని నిరుద్యోగులు అంటున్నారు. కొంతమంది తమ రాజకీయ మైలేజీ కోసం చూపిన అత్యుత్సాహంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిరుద్యోగులు వాపోతున్నారు.