బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు

కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని రాష్ట్ర పంచాయతీ రాజ్

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు

– ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది

– ప్రగతి భవన్ లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు రూ.12 లక్షలతో ఇండ్లు కట్టిండు

– రాష్ట్రంలో ఉన్న పేదలకు మాత్రం ఒక్క ఇల్లు ఇవ్వలే..

– మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

– గుర్తూరు గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క విమర్శించారు. ములుగు మండలంలోని గుర్తూరు తండాలో ఆదివారం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజా సంక్షేమం కోసం పనే చేసే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని మంత్రి అన్నారు. అభివృద్ధికి నోచుకోని మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. గుర్తూరు తండాలో గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చిన భూములకు పట్టాలు, పంటలకు సాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామన్నారు. నిరుపేదలను గుర్తించి రూ. 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశామని, ఇంకా 4 గ్యారెంటీలు త్వరలోనే అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ, డీపీఓ, ఐటీడీఏ ఈఈ, డీఈ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.