‘ఇండియా’కు కట్టుబడి ఉన్నాం

- దాన్నుంచి విడిపోయే సమస్యలే లేదు
- పంజాబ్ వివాదంపై కేజ్రీవాల్ స్పష్టత
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి కట్టుబడి ఉన్నామని, దాని నుంచి విడిపోయే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌సింగ్ ఖైరాను పంజాబ్ ప్రభుత్వం 2015 నాటి మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇది రాజకీయ కక్షపూరిత చర్యేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అరెస్టు నేపథ్యంలో ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు పొడసూపుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఈ సమయంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యేనన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిరస్కరించారు. ఆయన అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ‘ఇండియా కూటమికి ఆప్ కట్టుబడి ఉన్నది. కూటమి నుంచి వైదొలిగేది లేదు. మేం కూటమి ధర్మాన్ని పాటిస్తాం’ అని అన్నారు.
ఎమ్మెల్యేపై కేసు విషయాన్ని ప్రస్తావించగా.. ‘దాని గురించి నేను విన్నాను. కానీ పూర్తి వివరాలు తెలియవు. మీకు వివరాలు కావాలంటే పంజాబ్ పోలీసులను సంప్రదించండి’ అని చెప్పారు. పంజాబ్‌లో యువతను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల చీడను వదిలించేందుకు భగవంత్ మాన్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ క్రమంలో చిన్నవాళ్లనే కాదు.. పెద్ద హోదాలో ఉన్నవాళ్లను కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఇండియా కూటమి తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు తామే ప్రధానమంత్రి అనే భావనకు వచ్చేలా వ్యవస్థను రూపొందించే పనిలో ఉన్నాం. ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ప్రజలందరికీ అధికారం ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం’ అని చెప్పారు. పంజాబ్‌లో ఆప్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అక్కడి కాంగ్రెస్ సుముఖంగా లేదు.