Titanic | ‘టైటానిక్’ విషాద దృశ్యం.. పునరావృతం కాదు కదా
హీరో డీకాప్రియో క్లైమాక్స్ సీన్ రిపీట్ కాదు కదా.. అలా జరగరాదనే కోరుకుందాం. విధాత: వెంటాడుతున్న రెండు ప్రమాదాలు. అటు హైపర్ కాప్నియా… ఇటు హైపో థర్మియా… ‘టైటానిక్’ (Titanic) విహారయాత్ర ప్రయాణికులకు ‘డెడ్’లైన్ ఇక 10 గంటల్లోపే! ‘టైటాన్’ జలాంతర్గామిలో ఆక్సిజన్ అయిపోవచ్చింది. ఆహారం నిల్వలూ తక్కువే. దురదృష్టవశాత్తూ గాలింపు చర్యలు విఫలమైతే, ఆ ఐదుగురినీ కాపాడటం కుదరకపోతే.. ఇంకా వారు జలాంతర్గామిలోనే జీవించివుంటే.. ఇకపై వారు ఎదుర్కొనబోయే దయనీయ పరిస్థితి ఇదీ. ‘టైటాన్’ లోపల […]

- హీరో డీకాప్రియో క్లైమాక్స్
- సీన్ రిపీట్ కాదు కదా..
- అలా జరగరాదనే కోరుకుందాం.
విధాత: వెంటాడుతున్న రెండు ప్రమాదాలు. అటు హైపర్ కాప్నియా… ఇటు హైపో థర్మియా… ‘టైటానిక్’ (Titanic) విహారయాత్ర ప్రయాణికులకు ‘డెడ్’లైన్ ఇక 10 గంటల్లోపే! ‘టైటాన్’ జలాంతర్గామిలో ఆక్సిజన్ అయిపోవచ్చింది. ఆహారం నిల్వలూ తక్కువే. దురదృష్టవశాత్తూ గాలింపు చర్యలు విఫలమైతే, ఆ ఐదుగురినీ కాపాడటం కుదరకపోతే.. ఇంకా వారు జలాంతర్గామిలోనే జీవించివుంటే.. ఇకపై వారు ఎదుర్కొనబోయే దయనీయ పరిస్థితి ఇదీ.
‘టైటాన్’ లోపల ప్రాణవాయువు ఆమ్లజని నిల్వలు క్రమంగా నిండుకుంటాయి. ఐదుగురి నిశ్వాసల కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) స్థాయులు పెరిగిపోతాయి. వారి రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు అధికమవుతుంది. దీన్ని ‘హైపర్ కాప్నియా’ అంటారు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది మరణాలకు దారితీస్తుంది.
ఇక పొంచివున్న మరో గండం ‘హైపో థర్మియా’. తీవ్రమైన శీతలత్వం కారణంగా శరీర ఉష్ణోగ్రత క్షీణించి మరణించడం. ఒకవేళ ‘టైటాన్’ జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రంలో అట్టడుగున నేలపై పడిపోతే.. అక్కడ సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. వణుకు పుట్టించి, గడ్డకట్టించే చలి.. ‘హైపో థర్మియా’కు కారణమై ప్రాణాలు తీస్తుంది.
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ సినిమాలో హీరో లియోనార్డో డీకాప్రియో కూడా హీరోయిన్ కేట్ విన్స్లెట్ ను తేలియాడే ఓ చెక్కముక్క పైకి ఎక్కించాక తాను చివర్లో ఇలాగే చలికి బిగుసుకుపోతూ ‘హైపో థర్మియా’తో తుదిశ్వాస విడుస్తాడు.
1912లో మంచుకొండను ఢీకొని రెండు ముక్కలై ‘టైటానిక్’ ఓడ మునిగినప్పుడు లైఫ్ బోట్లు లేక అట్లాంటిక్ మహాసంద్రంలో పడిపోయిన ప్రయాణికుల్లో చాలామంది ఈత సామర్థ్యం లేక చనిపోలేదు. అత్యంత శీతల సముద్ర జలాల్లో ఈదడం సాధ్యం కాక మునిగిపోయి మరణించారు.
మునకకు 5 కారణాలు.
1.‘టైటానిక్’ ఓడ శిథిలాల్లో ‘టైటాన్’ చిక్కుకొని వాటి నుంచి బయటపడలేకపోయి ఉండొచ్చు.
2.టైటాన్ యంత్ర సామగ్రి, ఇతర సాధన సంపత్తి విఫలమై ఉండొచ్చు. విద్యుత్ అంతరాయం కలిగివుండొచ్చు.
3.చేపల వల వంటి చెత్తాచెదారంలో బహుశా ‘టైటాన్’ ఇరుక్కుందేమో. 2005లో ఓ రష్యన్ సబ్మెర్సిబుల్ కాంచట్కా ద్వీపకల్పంలో ఓ వలలో కూరుకుపోయి చివరికి సముద్ర భూతలానికి చేరింది. బ్రిటన్ నుంచి జలాంతరయాన డ్రోన్ ఒకదాన్ని రప్పించి ఆ వలను తెంపిన తర్వాత సబ్మెర్సిబుల్లోని ఏడుగురు క్షేమంగా బయటపడ్డారు.
4.సముద్ర పీడనం ధాటికి ‘టైటాన్’లో అంతర్గత విస్ఫోటనం సంభవించి ఉండొచ్చు. అంటే… సముద్రంలోని అధిక పీడనాన్ని జలాంతర్గామి తట్టుకోలేకపోతే (లోపల పేలుడు సంభవించి) అది నుజ్జునుజ్జయిపోతుంది. ఉపరితలంలో ఉండే పీడనం కంటే 10 వేల అడుగుల లోతులో ఉండే పీడనం 350 రెట్లు అధికం. ‘టైటాన్’ కార్బన్-ఫైబర్ బాడీ లేదా టైటానియం డోమ్ భాగంలో స్వల్ప దోషాలున్నా సముద్ర పీడనం జలాంతర్గామిని నలిపేస్తుంది. ‘టైటాన్’లో నిర్మాణపరమైన లోపాల్ని గుర్తించడం వల్లనే గతంలో మూడు యాత్రలు రద్దు చేశారనే అంశం సందర్భోచితంగా ప్రస్తావనార్హం.
5.‘టైటాన్’ జలాంతర్గామిలో విద్యుత్ వ్యవస్థలోకి నీరు ప్రవేశించి అగ్నిప్రమాదం జరిగివుండొచ్చు. 2019లో ఓ రష్యన్ జలాంతర్గామి వెయ్యి అడుగుల లోతులో ఉండగా బ్యాటరీ కంపార్టుమెంటులోకి నీరు చేరి మంటలు ఎగశాయి.
ఇతర ముఖ్యాంశాలు…
‘టైటాన్’ సబ్మెర్సిబుల్ నిజానికి జలాంతర్గామి కానే కాదు. దాని శక్తి నిల్వలు పరిమితం. దాన్ని సముద్రంలోకి దింపడానికి, పైకి తేవడానికి సాయంగా సముద్ర ఉపరితలంపై ఓ నౌక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ‘టైటాన్’లో కిటికీల్లేవు. కూర్చోడానికి సీట్లు కూడా లేవు. పర్యాటకులు కింద కూర్చోవాల్సిందే. ఒకేఒక మరుగుదొడ్డి ఉంది. ‘టైటాన్’ డిజైన్, అందులో వాడిన భాగాల సాంకేతికత (టెక్నాలజీ) స్థాయి తక్కువ. ఖర్చులు తగ్గించుకోవడానికి పరిశోధన-అభివృద్ధిపై పెద్దగా డబ్బు వెచ్చించలేదు. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులు వినియోగించారు.