Comrades | కామ్రేడ్ల స్వరం మారుతున్నదా?

Comrades | విధాత: కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గర్జన సభ పార్టీ నాయకత్వం ఆశించిన దాని కంటే విజయవంతమైంది. ఇది సీపీఐ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని కల్గించింది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహారంపై కామ్రేడ్లలో స్వరం మారుతున్నదన్న సంకేతాలను కూడా పంపింది. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి కానీ.. సీట్లు అడగవద్దన్నట్టు బీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం సభ పెట్టింది కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని బహిరంగ సభలో […]

  • By: krs    latest    Jun 13, 2023 3:58 AM IST
Comrades | కామ్రేడ్ల స్వరం మారుతున్నదా?

Comrades |

విధాత: కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గర్జన సభ పార్టీ నాయకత్వం ఆశించిన దాని కంటే విజయవంతమైంది. ఇది సీపీఐ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని కల్గించింది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహారంపై కామ్రేడ్లలో స్వరం మారుతున్నదన్న సంకేతాలను కూడా పంపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి కానీ.. సీట్లు అడగవద్దన్నట్టు బీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం సభ పెట్టింది కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని బహిరంగ సభలో ప్రస్తావించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఎన్నికలకు పోకుండా ఉండటానికి తామేమీ సన్యాసం పుచ్చుకోలేదని వ్యాఖ్యనించడం విశేషం.

తాము బీజేపీని వ్యతిరేకిస్తున్నందునే మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని, ఆ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉన్నదని నారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాశమవుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ విధానాలపైనా నారాయణ నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి దళిత బంధు పథకాన్ని ప్రస్తావిస్తూ.. ఊరికో కోడి.. ఇంటికో ఈక అన్నట్టు తయారైందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడని నిలదీశారు.

మునుగోడులో బీఆర్‌ఎస్‌కు వామపక్షాలు మద్దతు పలికాయి. అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితులు, బీజేపీకి స్థానికంగా బలం లేకపోయినా.. బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి స్థానికంగా బలం ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే.. వామపక్షాలు ఆనాడు బీఆర్‌ఎస్‌ వెంట నిలిచాయి. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గట్టెక్కిందంటే అది వామపక్షాల ఓటింగ్‌ పుణ్యమే అనడంలో సందేహం లేదు.

కానీ.. బీఆర్‌ఎస్‌ నాయకత్వం మాత్రం దానినీ తమ సంక్షేమ ప్యాకేజీలోనే వేసుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఒకటిరెండు సందర్భాల్లో మినహా వామపక్షాలు కేసీఆర్‌తో వేదిక పంచుకునే అవకాశం రాలేదు. తదుపరి కాలంలో అగాథం పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలోనే సీపీఐ ఆశిస్తున్న పలు సీట్ల విషయంలో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే బీఆర్‌ఎస్‌ నాయకత్వం నిర్ణయాలు తీసేసుకోవడం, వాటిని బహిరంగంగా ప్రకటించడం కూడా జరిగింది.

దీనిపై ఆగ్రహంతో ఉన్న సీపీఐ.. హుస్నాబాద్‌ వంటి స్థానాల్లో పోటీ చేసి తీరుతామని ప్రకటించింది. ఈ అంశాన్ని కూడా నారాయణ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాజకీయ ఐక్యత అనేది లెక్కల ఆధారంగా సాధ్యం కాదని, పరస్పర సహకారంతోపాటు అవగాహన ఉండాలని చెప్పడమే కాకుండా.. అతి తెలివి ప్రదర్శిస్తే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని కేసీఆర్‌కు చురకలు అంటించారు. సీట్లు అడగడం తమ రాజకీయ హక్కని తేల్చి చెప్పారు.

మునుగోడులో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. అయితే.. వాస్తవానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు దీటుగా నిలబడే పార్టీగా మాత్రం బీజేపీ లేదు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన నారాయణ.. తెలంగాణలో బీజేపీకి అంత సీన్‌ లేదని తేల్చేయడం విశేషం. పొత్తుల విషయంలో బంతిని తెలివిగా కేసీఆర్‌ కోర్టులోకి నారాయణ పంపించారు.

ఇప్పుడు లెఫ్ట్‌ పార్టీలకు బీజేపీ అనేది ప్రధాన శత్రువే అయినా.. దానిని ఓడించడానికి బీఆర్‌ఎస్‌తోనే జత కట్టాలని ఏమీ లేదు. పైగా మరోవైపు కాంగ్రెస్‌ నానాటికీ పుంజుకుని.. బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్నది. ఈ క్రమంలో అవకాశాలను తెరిచి ఉంచుకునే క్రమంలోనే నారాయణ వ్యాఖ్యానాలు చేసి ఉండచ్చనన్న అభిప్రాయం కలుగుతున్నది.