Pen price: ఒక పెన్ను ధర ఎంత ఉంటది..? రూ.10, 20, 50, 100 మహా అయితే రూ.500 ఉంటుంది. ఇంకా ఏమన్నా స్పెషల్గా ఉంటే రూ.1000 ఉంటది. మరీ అంతకంటే ఎక్కువ ధర అయితే ఉండదు. కానీ తమిళనాడు రాజధాని చెన్నైలో ‘చెన్నై పెన్ షో-2024’లో ప్రదర్శనకు ఉంచిన ఓ పెన్ను ధర వింటే మాత్రం షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఆ పెన్ను ధర వందల్లోనో, వేలల్లోనో లేదు. ఏకంగా లక్షల్లో ఉంది. పెన్ను ధర లక్షల్లో ఉండటం ఏంటీ అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి…
చెన్నైలోని అడయారులో ‘చెన్నై పెన్ షో-2024’ పేరిట ఒక పెన్ షో ఏర్పాటు చేశారు. గత శుక్రవారం నుంచి ఈ పెన్ షో కొనసాగుతోంది. ఈ మూడు రోజుల పెన్ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. ఈ షోలో మేగ్నాకార్ట్ సంస్థకు ఓ పెన్ను అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఆ పెన్ను ధర ఏకంగా రూ.1.90 లక్షలుగా ఉంది. మరి ఆ పెన్ను ఎందుకంత ఖరీదు అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆ పెన్నులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ పెన్ను నిబ్తో పాటు కొన్ని విడిభాగాలను బంగారంతో తయారుచేశారు. దీని స్టాండ్ కూడా ప్రత్యేకంగా ఉంది. స్టాండ్లో విల్లు ధరించిన రాముడు, గద, శ్రీరామ నామాలు, ఒక హారం ఉన్నాయి. ఎండ్లెస్ స్టేషనరీ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పెన్ ప్రదర్శనలో ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్ల నుంచి సుమారు 35 తయారీ సంస్థలు, డీలర్లు పాలుపంచుకున్నారు. దేశ, విదేశాలకు చెందిన వందకుపైగా ఉత్తమ బ్రాండ్ల కలాలు ఉన్నాయి. వీటి ధర రూ.600 నుంచి రూ.1.90 లక్షల వరకు ఉంది.