Ticket Tension | టికెట్ల టెన్షన్! మొదటి జాబితాలో వస్తుందా? లేదా?
Ticket Tension | ఆశావహుల్లో, ‘ఆ’ నేతల్లో ఉత్కంఠ! శ్రావణ మాసం మంచి రోజుల్లో జాబితాల విడుదలకు అధినేతల కసరత్తు బీఆరెస్, కాంగ్రెస్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఆఖరి నిమిషం వరకు కొన్ని సీట్లు ఆపుతారా? రాజకీయ సమీకరణలకు అనుగుణంగా చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు! గాంధీ భవన్‌లో స్క్రీనింగ్ కమిటీ భేటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తమను మార్చొద్దంటున్న బీఆరెస్ సిటింగ్‌లు ఈసారైనా అవకాశం ఇవ్వాలని ఆశావహులు కేటీఆర్, హరీశ్, కవిత చుట్టూ చక్కర్లు పలువురిని ఇప్పటికే […]

Ticket Tension |
- ఆశావహుల్లో, ‘ఆ’ నేతల్లో ఉత్కంఠ!
- శ్రావణ మాసం మంచి రోజుల్లో
- జాబితాల విడుదలకు అధినేతల కసరత్తు
- బీఆరెస్, కాంగ్రెస్ పొలిటికల్ రిజర్వేషన్స్
- ఆఖరి నిమిషం వరకు కొన్ని సీట్లు ఆపుతారా?
- రాజకీయ సమీకరణలకు అనుగుణంగా చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు!
- గాంధీ భవన్‌లో స్క్రీనింగ్ కమిటీ భేటీ
- అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
- తమను మార్చొద్దంటున్న బీఆరెస్ సిటింగ్‌లు
- ఈసారైనా అవకాశం ఇవ్వాలని ఆశావహులు
- కేటీఆర్, హరీశ్, కవిత చుట్టూ చక్కర్లు
- పలువురిని ఇప్పటికే ప్రకటించిన కేటీఆర్
విధాత: అసెంబ్లీ ఎన్నికల పోరుకు బీఆరెస్, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. శ్రావణ మాసం, మంచి రోజుల్లో మొదటి జాబితా విడుదలకు ఈ రెండు పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మంత్రి కేటీఆర్ ఆయా సభల నిర్వహణ సందర్భంగా నర్మగర్భంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇదే తీరుగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తున్నది. 70, 80 సీట్లలో మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే జాబితాపై కసరత్తు పూర్తి చేశారన్న చర్చ పార్టీ వర్గాలలో జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు చేశారు. తాజాగా సోమవారం గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రిలిమినరీ జాబితాను రూపొందించి హైకమాండ్‌కు పంపించనున్నారు. అధిష్ఠానం సూచించే మార్పులు చేర్పులతో ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది.
సర్వేల పైనే..
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీఆరెస్ పూర్తిగా సర్వేలపైనే ఆధార పడినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా సిటింగ్‌ల పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నది? ఆశావాహుల్లో ఎవరికి ప్రజాబలం ఉన్నది? ప్రత్యర్థి పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వొచ్చు.. మనం ఎవరికి టికెట్ ఇస్తే ప్రత్యర్థిపై గెలిచే అవకాశం ఉంటుందని సర్వేలు చేయించాయి. ఇంకా చేయిస్తూనే ఉన్నాయి. ఏ కులానికి చెందిన ప్రతినిధికి టికెట్ ఇస్తే గెలుస్తారన్న తీరుగా కూడా సర్వే చేయించినట్లు సమాచారం. ఇలా రెండు పార్టీలూ సర్వే సంస్థలనే నమ్ముకున్నాయి. పార్టీలు చేయించుకున్న సర్వేలలో ఎవరు బలమైన అభ్యర్థిగా ముందున్నారో వారికే టికెట్లు ఇస్తామని నేతలు, ఆశావహులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
నేతల చుట్టూ చక్కర్లు
ఆశావహులు టికెట్ల కోసం నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా సరే తమకే టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు. బీఆరెస్‌లో అధినేతను కలిసే అవకాశం లేక పోవడంతో అభ్యర్థిత్వాన్ని ఆశించే నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, కవితలను ప్రసన్నం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ ముగ్గురు నేతలు కూడా తమ వర్గానికి చెందిన నేతలకు ఎక్కువగా టికెట్లు వచ్చేలా మంత్రాంగం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న చర్చ కూడా ఉంది. నేరుగా కేసీఆర్‌ను కలుసుకోవాలనుకున్న నేతలు ఎంపీ సంతోష్‌కుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
అయితే టికెట్లు ఇచ్చే విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న కేసీఆర్ ఇవేవీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. కాగా ఎవరిని కలిసినా ప్రయోజనం లేదనుకున్నారో ఏమో.. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పువ్వాడ అజయ్, కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ తమకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు తమకే రిజర్వ్ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం బీఆరెస్‌లో ఉన్న సిటింగ్‌లలో 18 మందికి టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 18 నంబర్లలో తమ నంబర్ ఉందా అనే టెన్షన్ బీఆరెస్ ఎమ్మెల్యేలకు చెమటలు పోయిస్తున్నది. కాంగ్రెస్‌లో ఆశావహులు రేవంత్, ఉత్తమ్, భట్టి చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిత్యం తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేయిస్తున్నారు.
కాంగ్రెస్ టెంపో మెయింటెన్ చేయడానికి ఏమి కార్యక్రమాలు తీసుకోవాలో కూడా సలహాలు ఇస్తున్నారని సమాచారం. టికెట్ల కేటాయింపు ఆసాంతం సునీల్ కనుగోలు ఇచ్చే నివేదిక ఆధారంగానే ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతున్నది. ఇప్పటికే పార్టీ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసిన సునీల్ కనుగోలు.. ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందో లిస్ట్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. పూర్తిగా ఏఐసీసీ డైరెక్షన్‌లో పని చేసే సునీల్ కనుగోలు నివేదికలు కూడా అధిష్ఠానానికే నేరుగా పంపిస్తున్నారని సమాచారం.
క్లారిటీ ఉన్న స్థానాల్లో..
అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు మొదటి జాబితాలో ఎలాంటి ఇబ్బంది లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే ఆ మేరకు నియోజకవర్గాల్లో పని చేసుకోమని క్లియరెన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయభాస్కర్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరుల అభ్యర్థిత్వం విషయంలో పేచీ ఉండే అవకాశం లేనందున మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటికే అధికార బీఆరెస్ అభ్యర్థుల మొదటి జాబితా అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్టు చక్కర్లు కొడుతున్నది.
కాంగ్రెస్ కూడా ఇదే తీరుగా ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, లాంటి నేతలతో వీలైనంత ఎక్కువ మందితో మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాలలో సాగుతున్నది.
ఇదే సమయంలో వారసుల కోసం, కుటుంబ సభ్యుల కోసం టికెట్లు ఆశిస్తున్న నాయకుల విషయంలో ఏమి చేయాలన్న దానిపై కాంగ్రెస్, బీఆరెస్ నేతలు ప్రత్యేకంగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన ఇద్దరు కొడుకుల కోసం నాగార్జున సాగర్, మిర్యాలగూడ టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ కుమారులకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరి నిమిషం వరకు
కొన్ని స్థానాలపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొనే పరిస్థితి ఉంది. రాజకీయ సమీకరణల ఆధారంగానే ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికార బీఆరెస్‌లో ఈసారి అవకాశం రాని నేతలు పార్టీ మారుతారేమోనన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలలో అవకాశాలు రాని బలమైన నేతలను చేర్చుకొని టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. కింది స్థాయిలో కూడా భారీ ఎత్తున వలసను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల జనార్దన్‌రెడ్డి, తదితర బలమైన నేతలను పార్టీలోకి తీసుకున్నది. ఇదే తీరుగా బీజేపీలో ఉన్న మరి కొంత మంది బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రాజకీయ పునరేకీకరణ పేరుతో కాంగ్రెస్ వలసలను భారీగా ప్రోత్సహిస్తున్నది.
పార్టీ నుంచి వెళ్లిన నాయకులు తిరిగి స్వంత గూటికి రావాలంటూ ‘ఘర్ వాపసీ’ అంటూ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే అధికార బీఆరెస్, బీజేపీల నుంచి సీనియర్ నేతలు ఒకరిద్దరు పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. శ్రావణ మాసంలో కొంత మంది నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. న్న బీజేపీ కూడా చాలా నియోజకవర్గాలలో ఇతర పార్టీ నేతల కోసం చూస్తున్నట్లు సమాచారం.
పొత్తు కోసం సీట్లు అడుగుతున్న కమ్యూనిస్టులు
మునుగోడు ఉప ఎన్నికలో పొడిచిన పొత్తు జనరల్ అసెంబ్లీలో కొనసాగించాలని బీఆరెస్, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్ణయించాయి. పొత్తులో భాగంగా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ ఇస్తామని రెండు పార్టీలకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే సీపీఐ, సీపీఎంలు మరిన్ని సీట్లు కోరుతున్నాయి. ముఖ్యంగా హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా సీట్లు తమకు కావాలని సీపీఐ నాయకత్వం పట్టుబడుతున్నది. సీపీఎం పార్టీ మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం, ఇబ్రహీంపట్నం సీట్లు కోరుతున్నది. అయితే కమ్యూనిస్టులు అడుగుతున్న ఈ సీట్లన్నీ బీఆరెస్ సిటింగ్ స్థానాలే కావడం గమనార్హం.
తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులు దేవరకొండ, భద్రాచలంలో గెలిచారు. తరువాత పరిణామాల్లో సీపీఐ నుంచి గెలిచిన రవీంద్ర నాయక్ బీఆరెస్‌లో చేరారు. ఆ తరువాత కమ్యూనిస్టులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో బీఆరెస్ గెలుపునకు కారణమైన కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా తమకు ఆరేడు సీట్లు అడుగుతున్నారు.
అయితే పొత్తు కుదురుతుందా లేదా అన్న అనుమానాలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తలెత్తుతున్నాయి. కేసీఆర్‌ను కలిసి మాట్లాడాలని కమ్యూనిస్టు నాయకత్వం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంతవరకు సాధ్యం కాలేదు. తమతో చర్చలు జరుపకపోవడంపై సీపీఐ, సీపీఎం నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆఖరు నిమిషయంలో పొత్తు కుదరకపోతే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో ఉంది.