Titan | సాహసం సేయకురా డింభకా ! వినోదం వారిది.. భారం ప్రజలది.. ఆ ఖర్చంతా ఎవరు భరించాలి?
Titan | ఇంట్రెస్ట్ వారిది.. గోల ప్రజలది ఎవరు కట్టాలి.. బిల్లు? సమాజం ఎందుకు చెల్లించాలి? విధాత: ‘అట్లాంటిక్ మహాసముద్రంలో శతాబ్దం క్రితం మునిగిపోయిన ‘టైటానిక్’ సినిమాను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాం రండి బాబూ’.. అంటూ ఒక్కో టిక్కెట్ రేటు గ్రాండుగా రూ.2 కోట్లు పెట్టి, ఇరుకైన బుల్లి గొట్టంలో నలుగురేసి చొప్పున జనాన్ని తోలుకెళ్లి ‘ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్స్’ సంస్థ బాగానే ఆర్జించింది. బ్యాంకుల్లో డబ్బులు మూలుగుతున్న ముగ్గురు కోటీశ్వరులు ‘టైటాన్’లో సాహసయాత్ర చేసి బులపాటం […]

Titan |
- ఇంట్రెస్ట్ వారిది.. గోల ప్రజలది
- ఎవరు కట్టాలి.. బిల్లు?
- సమాజం ఎందుకు చెల్లించాలి?
విధాత: ‘అట్లాంటిక్ మహాసముద్రంలో శతాబ్దం క్రితం మునిగిపోయిన ‘టైటానిక్’ సినిమాను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాం రండి బాబూ’.. అంటూ ఒక్కో టిక్కెట్ రేటు గ్రాండుగా రూ.2 కోట్లు పెట్టి, ఇరుకైన బుల్లి గొట్టంలో నలుగురేసి చొప్పున జనాన్ని తోలుకెళ్లి ‘ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్స్’ సంస్థ బాగానే ఆర్జించింది.
బ్యాంకుల్లో డబ్బులు మూలుగుతున్న ముగ్గురు కోటీశ్వరులు ‘టైటాన్’లో సాహసయాత్ర చేసి బులపాటం తీర్చుకోవడానికి వెళ్లారు. కాలం కలసిరాక ఆ విషాదయాత్రలో పైలట్, సంస్థ సీఈవోతో పాటుగా ఆ ముగ్గురూ కాలం చేశారు. మరి గాలింపు-రక్షణ, సహాయక చర్యల ఖర్చు ఎవరు భరించాలి? ‘టైటాన్’ యాత్ర మాత్రమే కాదు.. చరిత్రలో ఇలాంటి దృష్టాంతాలెన్నో.
1998లో వేడిగాలి నింపిన బెలూన్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చే యత్నంలో సాహసి స్టీవ్ ఫాసెట్ సముద్రంలో పడినప్పుడు ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలకు బోలెడు వ్యయం అయింది. ‘ప్రాణాలతో నిన్ను రక్షించాం కదా, కాస్త ఆ సొమ్ము చెల్లించవయ్యా’ అని ఫాసెట్ మహాశయుడిని అడిగితే అతడు లేదు పొమ్మన్నాడు.
ఆ తర్వాత అదే ఏడాది బ్రాన్సన్ సహా వేడిగాలి బెలూన్లో యాత్ర చేస్తున్న ఫాసెట్ ఖర్మ కాలి మరోసారి సముద్రంలో పడ్డాడు. వారిని కాపాడటానికి అమెరికా తీర రక్షక దళం 1.3 లక్షల డాలర్ల పైనే ఖర్చు పెట్టింది. కోస్ట్ గార్డ్ కోరితే బిల్లు చెల్లించడానికి తాను సిద్ధమని పాపం బ్రాన్సన్ ముందుకొచ్చాడు.
కానీ కోస్ట్ గార్డ్ అడిగిందీ లేదు, బ్రాన్సన్ ఇచ్చిందీ లేదు. తొమ్మిదేళ్ల అనంతరం 2007లో అమెరికాలోని నెవడా ప్రాంతంలో స్టీవ్ ఫాసెట్ ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. దాని ఆచూకీ కనుగొనేందుకు నేషనల్ గార్డ్ నెలల తరబడి సహాయక చర్యలు చేపట్టింది.
కానీ ఆ విమాన ప్రమాదంలో ఫాసెట్ చనిపోయాడు. గాలింపు కోసం 6.85 లక్షల డాలర్ల వ్యయమైంది. ఇందులో 2 లక్షల డాలర్ల మేర ప్రైవేటు విరాళం లభించింది. ‘నీ భర్తను కాపాడటానికే కదా ఇంత శ్రమ కోర్చాం, నువ్వయినా ఆ మిగతా డబ్బులు చెల్లించవమ్మా’ అని ఫాసెట్ భార్యను కోరాలని నెవడా రాష్ట్ర గవర్నర్ ప్రయత్నిస్తే… భర్త విమానం ఆచూకీ కనుగొనేందుకు తాను సొంతంగా పది లక్షల డాలర్లు ఖర్చు పెట్టానంటూ ఆమె కూడా రిక్తహస్తం చూపింది. దాంతో ఆర్థిక భారం ప్రభుత్వం పైనే పడింది.
అంటే వ్యయ భారం పరోక్షంగా పన్ను చెల్లింపుదారులైన ప్రజల నెత్తినే పడింది. ఇక ‘ఎవరెస్ట్’ వీరోచిత యాత్రలూ ఈ కోవలోవే. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే అనుమతులు, ఫీజు రూపంలో వేల డాలర్లు చెల్లించాలి. ఈ సాహసయాత్రలో ఏటా వందలాది పర్వతారోహకులు చనిపోతూ లేదా గల్లంతవుతూ ఉంటారు. పర్వతారోహకులు ‘రెస్క్యూ బీమా’ చేయించాలని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది.
కానీ ఒక్కోసారి సహాయక చర్యల వ్యయం పరిమితి దాటి భారీగా ఉంటోంది. సముద్రయానాల్లో వేగం/దూరం రికార్డుల కోసం పరి తపించే సాహసవంతులు ఇంకొందరు. బుల్లి యాచెట్లలో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న తలంపుతో ఒంటరి యాత్రలు ఆరంభించి చిక్కుల్లోపడేది మరికొందరు.
‘టైటాన్’ దుర్ఘటన విషయంలో అమెరికా తీర రక్షక దళం నైతికతను, అది ప్రతిస్పందించిన తీరును అభినందించాల్సిందే. ‘టైటాన్’ అన్వేషణ ఖర్చు ఎంతో తెలిపేందుకు అది నిరాకరించింది. మానవీయ విలువల్ని ద్రవ్యరూపంలో చెప్పలేమని తేల్చిచెప్పిన అమెరికన్ కోస్ట్ గార్డుకు రియల్లీ హేట్సాఫ్!
వెదుకులాట-రక్షణ చర్యల వ్యయాన్ని తిరిగి వసూలు చేయరాదని అమెరికా ఫెడరల్ చట్టం స్పష్టీకరిస్తోంది. మరి ఇలాంటి ‘సాయం-రక్షణ’ ఏమేరకు చేయాలి? ఆర్థికంగా ఎంతవరకు భరించాలి? దీన్ని నిర్ణయించేది ఎవరు?