42 మందితో టీఎంసీ జాబితా

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు

42 మందితో టీఎంసీ జాబితా
  • మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌కు చోటు
  • మహువా మొయిత్రీకి మళ్లీ అవకాశం
  • నుస్రత్‌ జహాన్‌ సహా ఐదుగురికి దక్కని చాన్స్‌


కలకత్తా : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. మొత్తం 42 స్థానాలకు టీఎంసీ పోటీ చేయనున్నది. ఆదివారం బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తమ జాబితాను మమత వెల్లడించారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, బెంగాల్‌ టీవీ నటి రచనా బెనర్జీ ఉన్నారు. యూసుఫ్ పఠాన్ బరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.


కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష నేత అధిర్‌రంజన్‌ చౌదరి తిరిగి ఇక్కడి నుంచి పోటీచేయనున్నారు. రచనా బెనర్జీ హుగ్లీ సీటు నుంచి పోటీ చేస్తారు. మరొక మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ బర్ద్వాన్‌ -దుర్గాపూర్ సీటు నుండి పోటీ చేస్తారు. ఆదివారం విడుదల చేసిన జాబితాలో ఐదుగురు సిటింగ్‌ ఎంపీలను తప్పించారు. వయో భారం రీత్యా చౌదరి మోహన్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు బదులు మథురాపూర్‌ నుంచి యువతనే బపి హల్దర్‌కు అవకాశం ఇచ్చారు. ప్రముఖ బెంగాలీ సినీ తారలైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ పేర్లు లిస్టులో చేర్చలేదు.