TPCC | టీపీసీసీకీ సునీల్ సేవలు? కర్ణాటక ఊపుతో అధిష్ఠానం నిర్ణయం
TPCC 70 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు! 40 సీట్లకు మూడు లేదా నాలుగు పేర్లు సంప్రదింపులతో అధిష్ఠానం నిర్ణయం! విధాత: ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు సేవలను తెలంగాణలోనూ వాడుకోవాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, బలాలు, బలహీనతలపై విస్తృతంగా సర్వేలు చేసి సునీల్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంగ్రెస్ తన అభ్యర్థులను ఖరారు చేసింది. […]

TPCC
- 70 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు!
- 40 సీట్లకు మూడు లేదా నాలుగు పేర్లు
- సంప్రదింపులతో అధిష్ఠానం నిర్ణయం!
విధాత: ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు సేవలను తెలంగాణలోనూ వాడుకోవాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, బలాలు, బలహీనతలపై విస్తృతంగా సర్వేలు చేసి సునీల్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంగ్రెస్ తన అభ్యర్థులను ఖరారు చేసింది.
ఈ వ్యూహం ఫలించడంతో కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని చేజిక్కించుకుంది. దీంతో సునీల్ సేవలను త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్రంలోనూ వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది.
బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఈసారి ప్రధానంగా పోటీ ఉంటుందనేలా వాతావరణం మారిపోయింది. కేసీఆర్ ఇప్పటికే దశాబ్ది ఉత్సవాల పేరుతో జనంలోకి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. కేసీఆర్ వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు సునీల్ కానుగోలును కాంగ్రెస్ ఇప్పటికే రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు.
70 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు?
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వేలు చేయించినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఈ సర్వే సమాచారాన్ని ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. సునీల్ కానుగోలు చేసిన ఈ సర్వేను ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించిందని చెబుతున్నారు. దీనిపై టీపీసీసీ- అధిష్ఠానం మధ్య తొలిదఫా చర్చ జరిగినట్లు సమాచారం.
గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న 70 మంది అభ్యర్థుల పేర్లను సునీల్ ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసి అధిష్ఠానానికి ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ జాబితాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలు ఉన్నారని చెబుతున్నారు. కానీ పేర్లు మాత్రం ఎక్కడా మీడియాకు లీకు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
49 స్థానాల్లో తేలని అభ్యర్థులు!
మిగిలిన 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు నుంచి నాలుగు పేర్లను సునీల్ సూచించినట్లు చెబుతున్నారు. ఇలాంటి సీట్లలో ఎవరిని ఎంపిక చేయాలన్నది అధిష్ఠానం.. టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు, సీనియర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు పేర్లు ఖరారు కాగా ఖమ్మంలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఈ సమీకరణల్లో మార్పులు, చేర్పులు జరగవచ్చని అంటున్నారు.
పొంగులేటితో ఖమ్మంలో బీఆర్ ఎస్‌కు చెక్
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిజ్ఞ చేశారు. పొంగులేటి బలాన్ని వాడుకోవాలని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించి ఆయన్ను కాంగ్రెస్‌లో చేరేందుకు ఒప్పించినట్లు చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్‌లో ఆరు, ఐదు నియోజకవర్గాలకు సునీల్ పేర్లను సూచించారని తెలిసింది.
మొత్తం మీద 119 టికెట్లలో సగానికి పైగా కన్ఫర్మ్ అయ్యాయని, మిగిలిన వాటిపై సునీల్ రానున్న రోజుల్లో పని చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు తెలంగాణలో ప్రతిపక్షంగా మిగిలిపోయింది. దీంతో 2023 ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది.