ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను సంపాదించేందుకు తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్య

మూడు రాష్ట్రాల్లో ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచిన అక్రమ సంబంధాలు ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఒకరి ప్రాణం తీశాయి

ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను సంపాదించేందుకు తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్య
  • అక్రమ సంబంధాలకు వ్యక్తి బలి
  • తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని హత్య చేసిన మహిళ
  • కోల్‌కతా పారిపోతుండగా అరెస్ట్‌

గువాహటి: మూడు రాష్ట్రాల్లో ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచిన అక్రమ సంబంధాలు ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఒకరి ప్రాణం తీశాయి. అసోం రాజధాని గువాహటిలోని ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన హత్యకు సంబంధించి ఒక పురుషుడిని, ఒక మహిళను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు మహారాష్ట్రలోని పుణెవాసి.

అంజలీ షా, ఆమె ప్రియుడు బికాశ్‌ షా ఇద్దరూ కలిసి.. పథకం ప్రకారం.. అంజలి మాజీ ప్రియుడు సందీప్‌ కాంబ్లీని హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాంబ్లీతో అంజలి ‘సన్నిహితంగా’ ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సంపాదించడం కోసం వారీ దారుణానికి తెగించారని చెప్పారు. హత్య అనంతరం కోల్‌కతాకు విమానంలో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. కోల్‌కతా పోలీసులే పట్టుకున్నారు.

సందీప్‌ కాంబ్లీ అనే వ్యక్తి మహారాష్ట్రలోని పుణెలో కారు డీలర్‌. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పనిచేసే అంజలీ షాతో అతడు సంబంధం పెట్టుకున్నాడు. కానీ.. అంజలి అప్పటికే బికాష్‌ షాతో ప్రేమలో ఉన్నదని పోలీసులు తెలిపారు. ‘కాంబ్లీతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నప్పటికీ.. అతడు మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని అంజలిని ఒత్తిడి చేస్తున్నాడు. కానీ.. అప్పటికే అంజలికి బికాశ్‌ షా అనే వ్యక్తితో ఎఫైర్‌ ఉన్నది’ అని గువాహటి పోలీస్‌ కమిషనర్‌ దిగంత బోరా చెప్పారు. తాను కాంబ్లీతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోల గురించి అంజలి.. బికాశ్‌కు చెప్పింది. ఎలాగైనా వాటిని సంపాదించాలని ప్లాన్‌ వేశారు. గువాహటిలో ఫిబ్రవరి 4వ తేదీన కలుసుకుందామని సందీప్‌కు అంజలి కాల్‌ చేసి చెప్పింది. దీంతో ఏదేదో ఊహించుకున్న సందీప్‌.. ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాడు. పథకం ప్రకారం బికాశ్‌ కూడా అదే హోటల్‌లో రూమ్‌ తీసుకున్నాడు. అనుకున్న సమయంలో కాంబ్లీతో గొడవకు దిగిన బికాశ్‌.. అంజలితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు ఉన్న మొబైల్‌ ఫోన్‌ను గుంజుకునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ బాగా కొట్టుకున్నారు. ఈ తన్నులాటలో కాంబ్లీ గాయపడి.. స్పృహ తప్పాడు. దీంతో భయపడిన జంట.. అక్కడి నుంచి ఉడాయించింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బికాశ్‌, కాంబ్లీ మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ గొడవలో సందీప్‌ కాంబ్లీకి కొన్ని గాయాలయ్యాయని, స్పృహ తప్పిన అతడు.. అనంతరం మరణించాడని తెలిపారు. ఇద్దరి మధ్య ఘర్షణను గుర్తించిన హోటల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. అంజలి, బికాశ్‌ను అదే రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో గువాహటి ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. రాత్రి 9.15 గంటలకు వారు విమానం ఎక్కి కోల్‌కతా వెళ్లాల్సి ఉన్నది.