TS Assembly | అసెంబ్లీ సమావేశాలు.. అధికార పార్టీ రాజకీయాల వెనుక?
TS Assembly | విధాత: రాష్ట్రంలో బీజేపీ బలం ఎంత అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీలో ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్నది ముగ్గురే శాసనసభ్యులే. నలుగురు ఎంపీలున్నా ఆ పార్టీ జాతీయ నాయకత్వం వీరి విజ్ఞప్తులను ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించదు. ఎందుకంటే పార్లమెంటులోనూ ఈ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, ప్రాజెక్టులు, విభజన హామీల గురించి కాకుండా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అప్రస్తుత అంశాల గురించి ప్రస్తావిస్తుండటం మనం చూస్తున్నదే. ఎన్నికలు […]

TS Assembly |
విధాత: రాష్ట్రంలో బీజేపీ బలం ఎంత అన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీలో ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్నది ముగ్గురే శాసనసభ్యులే. నలుగురు ఎంపీలున్నా ఆ పార్టీ జాతీయ నాయకత్వం వీరి విజ్ఞప్తులను ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించదు. ఎందుకంటే పార్లమెంటులోనూ ఈ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, ప్రాజెక్టులు, విభజన హామీల గురించి కాకుండా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అప్రస్తుత అంశాల గురించి ప్రస్తావిస్తుండటం మనం చూస్తున్నదే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆపార్టీలోనే అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి.
దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఉన్నదనే చర్చ ప్రజల్లోనూ, రాష్ట్ర రాజకీయవర్గాల్లో చాలా కాలంగా జరుగుతున్నది. కొంతమంది ఆ పార్టీ నేతలూ కూడా దీనిపై అనేకసార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో కొందరైతే కేంద్ర పెద్దల వైఖరిపై బాహాటంగానే విమర్శలు ఎక్కు పెడుతున్నారు. దీనికి కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉండబోతున్నది.
కాషాయ పార్టీ పోటీలో ఉన్నా ఉనికి కోసం కొట్లాడటమే తప్పా కింగ్ కాలేదు, కింగ్‌మేకర్ కాలేదనే విషయాన్ని ఆ పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ అగ్రనాయకులు కొత్త నాటకానికి తెరలేపినట్టు అనిపిస్తున్నది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తాను అన్నట్టు అక్కడ పార్లమెంటు సమావేశాల్లోనూ, ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇరు పార్టీల చట్టసభల సభ్యులు వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర నాయకత్వానికి అప్పుడప్పుడు దిశానిర్దేశం చేస్తూనే.. అసలు రాజకీయమంతా రాజ్‌భవన్ నుంచే నడిపిస్తున్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడురోజుల అసెంబ్లీ సమావేశాల్లో గతంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై అనుమానాలు వ్యక్తం చేసిన గవర్నర్ వాటిని ఆమోదించలేదు.
చివరికి ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో కొన్ని బిల్లులకు ఆమోదం లభించింది. మరికొన్నింటిని గవర్నర్ తిప్పి పంపారు. ఆ బిల్లులనే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి ఆమోదించారు. అలాగే క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కొన్ని బిల్లులతో పాటు ప్రధానంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై రెండురోజులుగా ఉత్కంఠ నెలకొన్నది.
ఈ బిల్లును కావాలనే అడ్డుకుంటున్నారని ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించడం, ఉదయం రెండు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిపివేయడం, చెన్నైలో ఉన్న గవర్నర్ రాజ్‌భవన్‌కు వచ్చిన పది మంది నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం, మీ ప్రయోజనాల పరిరక్షణాలను తాను పరిరక్షిస్తానని వారికి వాగ్దానం చేయడం వంటివి నిన్నంతా జరిగాయి.
మూడు రోజుల సమావేశాల్లో ప్రభుత్వం కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేయడం, రాజ్‌భవన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎపిసోడ్ కొనసాగడంతో మూడు రోజుల సమావేశాల్లో రెండు రోజులు గడిచిపోయాయి. అయితే ఈ బిల్లుపై రాజ్‌భవన్ వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, తిరిగి రాజ్‌భవన్ శనివారం మధ్యాహ్నం కొత్త సందేహాలు వ్యక్తం చేసింది. వీటికి కూడా ప్రభుత్వం సాయంత్రమే సమాధానాలు పంపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించాలనుకున్నా గవర్నర్ రెండు సార్లు వివరణ కోరారు.
దీనిపై కార్మికులు ఆందోళనగా ఉన్నదా. చైన్నైలో ఉన్న గవర్నర్ నేడు నగరానికి రానున్నారు. దీంతో ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశానికి నోచుకుంటుందా అన్నది తేలనున్నది. మొదట గవర్నర్ లేవనెత్తిన అన్ని సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందకుండా.. తాజాగా మరో ఆరు అంశాలపై వివరణ కోరారు.
అందులో ప్రధానమైంది ఆర్టీలో కేంద్రం వాటా 30 శాతం ఉన్నదని పేర్కొన్నందున, విలీనానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే సంబంధిత కాపీ పంపాలని, తీసుకోకుంటే న్యాయపరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు చెప్పాలని కోరారు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇస్తూ.. బిల్లు లక్ష్యాలతో పేర్కొన్న విధంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్.
దీని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమౌతారని, ఆస్తులు, అప్పులన్నీ కార్పొరేషన్‌కే ఉంటాయి. ప్రతిపాదిత బిల్లులో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కి తీసుకోవడం లేదని, ఏపీఎస్‌ఆర్టీనీ విభజన ఇంకా పెండింగ్‌లో ఉన్నది. కాబట్టి ఈ దశలో ప్రస్తుత బిల్లు కోసం కేంద్రం ఆమోదం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు వివరణ ఇచ్చింది.
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అన్న తర్వాత గతంలో సీఎం కేసీఆర్ ఇది విలీనం అసాధ్యం అన్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. అప్పుడు కానిది ఇప్పుడెలా సాధ్యమైందని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శించింది. ఆర్టీసీ ఆస్తుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదనే ఇతర ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలోనూ చాలామంది నెటీజన్లు ఆరోపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో గవర్నర్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటా రో చూడాలి. అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, అనేక ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధమంటూనే.. ప్రభుత్వం రెండు రోజులుగా తమ ప్రభుత్వ ఘనతను చెప్పుకుంటూ.. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతూ అనేక విషయాలను పక్కదోవ పట్టించిందనే విమర్శలు వస్తున్నాయి. చట్టసభలు పాస్ చేసిన బిల్లులు గవర్నర్ ఆమోదం తర్వాతే చట్టంగా మారుతాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్లో లోపాలు ఉన్నాయని గవర్నర్ గతంలో కొన్ని బిల్లులును, తాజాగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించే బిల్లుపై సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ మాత్రమే ఉన్నట్టు రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమౌతుంది. కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూపించి బీజేపీని ఎక్కువగా ఫోకస్ చేయడానికే బీఆర్‌ఎస్ యత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.